కదిరి అర్బన్: టీచర్ కొట్టడంతో విద్యార్థి తలకు గాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కదిరి– హిందూపురం రోడ్డులో ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 31న 8వ తరగతి చదివే అల్తాఫ్ అనే విద్యార్థి ఎత్తు కొలుచుకోవడం తనకు రాదని సోషల్ ఉపాధ్యాయురాలైన సుజాతకు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆమె తలపై కర్రతో కొట్టింది. దీంతో విద్యార్థి తలకు రక్తగాయమైంది. సదరు ఉపాధ్యాయురాలు భయపడి రక్తాన్ని నీళ్లతో కడిగేసి ఇంట్లో ఎవరికీ చెప్పద్దని పంపించేసింది. తలగాయం నొప్పిరావడంతో మరుసటి రోజు జరిగిన విషయాన్ని విద్యార్థి తన సోదరుడికి చెప్పాడు. విద్యార్థి సోదరుడు ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలపడంతో ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని వారు బుధవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. మండల విద్యాధికారి చెన్నక్రిష్ణ పాఠశాలలో విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జూదరుల అరెస్ట్
మడకశిర: మండలంలోని కల్లుమర్రి, అగ్రంపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జూద కేంద్రాలపై రూరల్ సీఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఎస్‌ఐ కృష్ణారెడ్డి, పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. అభి అనే వ్యక్తి మడకశిర, హిందూపురం, కర్ణాటకలోని మధుగిరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జూదరులను రప్పించి పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రవీంద్ర, కిషోర్, నరసన్న, ఆదెన్న అనే జూదరులు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.72 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 5 ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. కొంతమంది జూదరులు పారిపోయినట్లు పేర్కొన్నారు. వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు పెనుకొండ డీఎస్పీ పర్యవేక్షణలో దాడులు చేసినట్లు చెప్పారు. జూదరులపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
వెల్ఫేర్ అసిస్టెంట్ చేతివాటం!
కదిరి అర్బన్: సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీలో ఓ వెల్ఫేర్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కదిరి మండల పరిధిలోని బాలప్పగారిపల్లి క్వార్టర్స్‌కు చెందిన వెంకటమ్మ అనే మతి స్థితిమితం లేని మహిళకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రకాష్ పెన్షన్ డబ్బు రూ.4 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.2 వేలే ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీంతో వెల్ఫేర్ అసిస్టెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఎంపీడీఓ నసీమాను వివరణ కోరగా ఆమె స్పందించారు. పెన్షన్ రూ. 4 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.3,500 ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓ ఇచ్చే విచారణ నివేదికను ఉన్నతాధికారులను పంపిస్తామని, తప్పు జరిగినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


