పుట్టపర్తి టౌన్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.84 లక్షల విలువైన 47 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. గత ఏడాది బుక్కపట్నం, ధర్మవరం ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక వివరాల ఆధారంగా చిత్తూరు జిల్లా చౌడేపల్లి వైఎస్సార్ కాలనీకి చెందిన శ్రీనివాసులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బుధవారం చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్ గేట్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇతను 2016 నుంచి తాళం వేసిన ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయాల్లో ఒంటరిగా దొంగతనాలకు పాల్పడేవాడని వెల్లడైంది. నిందితునిపై ఇప్పటివరకూ 20 కేసులు నమోదైనట్లు గుర్తించారు. తిరుపతి, చిత్తూరు, పాకాల, మదనపల్లె, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాల్లోనూ ఇతనిపై కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. శ్రీకాళహస్తిలో నమోదైన కేసులో అరెస్టయ్యి జైలుకు కూడా వెళ్లాడు. నిందితున్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీలు జగన్నథ్‌రాజు, సత్యనారాయణ, సీఐ సురేష్, ఎస్‌ఐ సత్యనారాయణ, ఎస్‌ఓజీ బృందాలను ఎస్పీ అభినందించారు. నేరగాళ్లను గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో ఐరన్ గ్రిల్ సిస్టంతో పాటు డోర్‌లాక్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో ఉంచుకోవాలని, ఎల్‌ఎచ్‌ఎంఎస్ యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. పోగొట్టుకున్న బంగారం తిరిగి తమ చేతుల్లోకి రావడంతో బాధితులు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా తదితరులు పాల్గొన్నారు.
47 తులాల బంగారం, కేజీ వెండి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్


