ఆధిక్యంలో కర్నూలు, చిత్తూరు | - | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో కర్నూలు, చిత్తూరు

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా ఏసీజీ, ఆర్‌సీజీ మైదానాల్లో సాగుతున్న ఏసీఏ అండర్‌–23 పురుషుల మల్టీ డే సౌత్‌జోన్‌ క్రికెట్‌ టోర్నీలో భాగంగా కర్నూలు, చిత్తూరు జట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆర్‌సీజీ మైదానంలో కర్నూలు, అనంతపురం జట్లు తలపడగా... టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన అనంతపురం జట్టు 51.2 ఓవర్ల వద్ద 287 పరుగులకు ఆలౌట్‌ అయింది. బ్యాటర్లు జయంత్‌కృష్ణ 86, ఎంకే దత్తారెడ్డి 52, మనోజ్‌కుమార్‌ 42 పరుగులు సాధించారు. కర్నూలు బౌలర్లలో దినేష్‌కుమార్‌ 5, అక్షిత్‌రెడ్డి 3, గౌరవిఖ్యాత్‌ 1 వికెట్లు తీశారు. బుధవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్నూలు జట్టు 64.2 ఓవర్ల వద్ద ఆరు వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. బ్యాటర్లు నయీముల్లా 73, గౌర విఖ్యాత్‌ 68, విష్ణువర్దన్‌ నాయుడు 52 పరుగులు సాధించారు. కర్నూలు బ్యాటర్‌ గౌర విఖ్యాత్‌ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును పటిష్ట స్థాయికి చేర్చాడు.

● ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు, చిత్తూరు జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెల్లూరు జట్టు 307 పరుగులకు ఆలౌట్‌ అయింది. బ్యాటర్లు నిఖిలేశ్వర్‌రెడ్డి 80, సుతేజ్‌రెడ్డి 40, ఏకాక్షర్‌ 40 పరుగులు సాధించారు. చిత్తూరు బౌటర్లలో రెడ్డి ప్రకాష్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఆరు వికెట్లు కూలదోసిన విషయం తెలిసిందే. అనంతరం చిత్తూరు జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 90.2 ఓవర్ల వద్ద 501 పరుగులకు ఆలౌట్‌ అయింది. బ్యాటర్‌ చరంజిత్‌ 101 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్‌ లోహిత్‌ లక్ష్మీనారాయణ 70, తేజారెడ్డి 70 సాధించారు. నెల్లూరు బౌలర్‌ భార్గవ్‌ మహేష్‌ ఐదు వికెట్లు తీశాడు. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి చిత్తూరు జట్టు 194 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement