ఎన్‌పీకుంట: మండల పరిధిలోని వెలిచలమల గ్రామంలో సోమవారం రాత్రి రెండిళ్లలో జరిగిన చోరీలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బి.నాగిరెడ్డి తన కుటుంబ సభ్యులతో ముందు గదిలో తాళం వేసి పడుకుని ఉండగా గుర్తు తెలియని దుండగలు వెనుక వైపు ఉన్న ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా పడవేసి రెండు జతల బంగారు కమ్మలు, రూ.25,000 నగదు అపహరించారు. అక్కడే ఉన్న మరో బీరువా (లాకర్) తెరిచే ప్రయత్నం చేసినా తెరుచుకోక పోవడంతో అక్కడి నుంచి వెళ్లి పోయారు.
● అదే గ్రామానికి చెందిన బి.రాములమ్మ తనకు ఆరోగ్యం సరిలేక వారం క్రితం బాగేపల్లిలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఇంటిని శుభ్రపరచడానికి పనిమనిషి వెళ్లగా అప్పటికే ఇంటికి ఉన్న గొళ్లెం విరిగి పడి ఉండటంతో వెంటనే రాములమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె తమ బంధువుల ద్వారా ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న రూ.2,000 దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామని, క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించినట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.


