హంద్రీ–నీవా.. అడిగేవారే లేరా? | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా.. అడిగేవారే లేరా?

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

మడకశిర: కరువుకు నిలయమైన మడకశిర నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్‌ హయాంలో ప్రారంభమైన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్‌ జగన్‌ హయాంలో పనులు ప్రారంభమైనా...రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకం పూర్తికి చొరవ చూపకపోవడంపై రైతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

వైఎస్సార్‌ హయాంలో

రూపుదిద్దుకున్న హంద్రీ–నీవా

2004లో రెండో విడత ‘పల్లెబాట’ కార్యక్రమంలో భాగంగా సీఎం హోదాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ ప్రాంతంలోని కరువు పరిస్థితులను కళ్లారా చూశారు. మడకశిరకు కృష్ణా జలాలను అందించి కరువు రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. వెంటనే హంద్రీనీవా సాగునీటి పథకం పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకం గురించి పట్టించుకోలేదు. మళ్లీ 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పనుల్లో కదలిక వచ్చింది. వరుసగా మూడేళ్లు మడకశిర మండలానికి కృష్ణా జలాలు అందించారు. మడకశిర చెరువును రెండుసార్లు మరువ పారించారు. దీంతో నియోజకవర్గంలోని మిగతా మండలాల రైతుల్లోనూ ఆశలు చిగురించాయి. కానీ 2024లో చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టడంతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకం మూలన పడిపోయింది.

మూడు మండలాల్లో పనులు పెండింగ్‌..

మడకశిర, అమరాపురం మండలాల్లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. గుడిబండ మండలంలో కూడా కొంతమేర పెండింగ్‌లో ఉన్నాయి. ఇక అగళి, రొళ్ల మండలాల్లో కాల్వలు తప్ప పనులే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా మడకశిర మండలంలోని నాలుగైదు చెరువులకు మాత్రమే కృష్ణా జలాలు అందుతున్నాయి. దీంతో మిగతా మండలాల రైతులు కృష్ణమ్మ తమ దరికి ఎప్పుడు చేరేనోనని ఎదురుచూస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో

రూ.70 కోట్లతో ప్రణాళిక..

వైఎస్‌ జగన్‌ హయాంలో నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకం పనులను పూర్తి చేయడానికి ఓ ప్రణాళిక రూపొందించారు. రూ.70 కోట్లతో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకూ కృష్ణా జలాలు అందించాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించారు. అయితే అంతలోనే ఎన్నికలు రావడం, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ప్రణాళిక అమలు ఆగిపోయింది.

బైపాస్‌ కెనాల్‌ రూపకర్త వైఎస్‌ జగన్‌..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే మడకశిర బైపాస్‌ కెనాల్‌ రూపుదిద్దుకుంది. గొల్లపల్లి రిజర్వార్‌ నుంచి కృష్ణా జలాలను నేరుగా మడకశిర నియోజకవర్గానికి తరలించాలనే ఉద్దేశంతో బైపాస్‌ కెనాల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.214.85 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో ఈ కెనాల్‌ నిర్మాణం ఆగిపోయింది.

పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌..

రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. అయినా హంద్రీనీవా సాగునీటి పథకానికి సంబంధించిన పెండింగ్‌ పనులను పూర్తి చేయడానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు పెండింగ్‌ పనులను పూర్తి చేయకుండా, ఇటు బైపాస్‌ కెనాలు పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చూపుతోందని రైతులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హడావుడికే పరిమితం..

హంద్రీనీవా సాగునీటి పథకంపై స్థానిక ప్రజా ప్రతినిధులు హడావుడికే పరిమితమవుతున్నారు. ఇంతవరకు ఈపథకం పనులపై ఎలాంటి పురోగతి సాధించలేక పోయారు. ముఖ్యమంత్రి, జలవనరులశాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం...దాన్ని ప్రచారం చేసుకోవడానికే పరిమితమయ్యారు. అంతేకాకుండా అమరాపురం మండలానికి కృష్ణా జలాలు పారిస్తామని, ముఖ్యమంత్రి వచ్చి జలహారతి ఇస్తారని ప్రచారం చేశారు. రైతులందరూ ఎంతో సంతోషపడ్డారు. అయితే రోజులు గడిచాయేగానీ... ఇంతవరకు అమరాపురం మండలంలో కృష్ణా జలాలు పారలేదు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధి ప్రచారం మానుకుని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులపై చిత్తశుద్ధి చూపాలని రైతులు కోరుతున్నారు.

ఇది అగళి మండలంలోని హంద్రీ–నీవా కాలువ దుస్థితి. వైఎస్సార్‌ హయాంలో తవ్విన కాలువలో కృష్ణా జలాలు నేటికీ పారలేదు. 2004లో పల్లెబాటలో భాగంగా మడకశిర ప్రాంతంలో పర్యటించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. అయితే ఆయన మరణానంతరం ఆ పనులు అటకెక్కాయి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మళ్లీ పనులు ప్రారంభమైనా...తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కాల్వల వైపు కన్నెత్తి చూడటం లేదు.

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకంపై

చంద్రబాబు సర్కార్‌ శీతకన్ను

పెండింగ్‌ పనుల పూర్తికి

చొరవ చూపని వైనం

వైఎస్‌ జగన్‌ హయాంలో

రూ.70 కోట్లతో ప్రణాళిక

బైపాస్‌ కెనాల్‌ నిర్మాణానికి రూ.214.85 కోట్లు మంజూరు

తాజాగా మడకశిర బైపాస్‌ కెనాల్‌ కూడా ప్రశ్నార్థకం

హడావుడికే పరిమితమైన

ప్రజా ప్రతినిధులు

రైతులకు తప్పని సాగునీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement