అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో ఆగస్టు 30న డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఇన్‌స్టంట్ పరీక్ష నిర్వహించారు. జవాబు పత్రాలను వేగవంతంగా మూల్యాంకనం చేసి 24 గంటల్లోనే ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా, వారి భవిష్యత్తు విద్యా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య సమర్థవంతంగా పర్యవేక్షించారని ప్రశంసించారు. ఇన్‌స్టంట్ పరీక్షలకు మొత్తం 231 మంది విద్యార్థులు హాజరు కాగా, 228 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.
ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా
డాక్టర్ శ్రీకాంతి
హిందూపురం టౌన్: మడకశిరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంతి ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ డీసీహెచ్‌ఎస్‌గా పనిచేసిన డాక్టర్ మధుసూదన్ పదవీ విరమణ పొందడంతో ఉన్నతాధికారులు ఆయన స్థానంలో శ్రీకాంతి నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆమె... కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పట్నం పోలీస్ స్టేషన్ తనిఖీ
ముదిగుబ్బ: మండల పరిధిలోని పట్నం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సునీత, పట్నం ఎస్‌ఐ మహమ్మద్ అర్షద్‌ను అడిగి స్టేషన్ పరిధిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. అలాగే పోలీస్ సిబ్బంది యోగక్షేమాలను కూడా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
నేడు ఐఏబీ సమావేశం
● హడావుడిగా ఖరారు చేసిన అధికారులు
అనంతపురం సెంట్రల్: సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం మంగళవారం అనంతపురంలో నిర్వహించనున్నారు. హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాతో పాటు ఆలూరు బ్రాంచ్ కెనాల్ కింద కర్నూలు జిల్లా రైతులు, పులివెందుల, మైలవరం బ్రాంచ్‌కెనాల్స్ కింద వైఎస్సార్ కడప జిల్లాల రైతులు ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా హాజరుకావాల్సి ఉంది. గతంలో వారం రోజుల క్రితమే ఐఏబీ సమావేశం తేదీ ఖరారు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ రాత్రికి రాత్రి సమావేశాల తేదీలను ఖరారు చేసేస్తున్నారు. ఇటు హెచ్చెల్సీ.. అటు హంద్రీ–నీవా ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటి వినియోగంపై రైతులకు ఉపయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఐఏబీ సమావేశం అత్యంత కీలకం. అలాంటి సమావేశాన్ని అధికారులు హడావుడిగా నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా హెచ్చెల్సీ ద్వారా దాదాపు 20 టీఎంసీలకు పైగా నీరు వచ్చే అవకాశముంది. అయితే గత బోర్డు సమావేశంలో అప్పటి అంచనాల మేరకు 16 టీఎంసీలు కేటాయించారు. దీంతో సాగుకు నీటిని విడుదల చేయడానికి ఆస్కారం లేదంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం దాదాపు 100 టీఎంసీల సామర్థ్యంతో తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీకి కేటాయింపులు పెరగనున్నాయి. అయినప్పటికీ సాగునీటికి నీటిని విడదుల చేయకూడదనే భావనతో పాటు తుంగభద్ర హై లెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు రైతులకు మాత్రమే మేలు చేకూర్చేందుకు.. దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయలేమని చెప్పే విధంగా ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేటి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


