ప్రశాంతినిలయం: భూపరిహారం చెల్లించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతూ పుట్టపర్తి మండలం గోనేనాయక్ తండాకు చెందిన రాజ్‌కుమార్ నాయక్ అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఈ ఘటన సోమవారం పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు...రాజ్‌కుమార్ నాయక్ కుటుంబానికి పుట్టపర్తి మండల పరిధిలోని కప్పలబండ రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 165–3హెచ్‌లో 1.15 ఎకరాల పొలం ఉంది. పూర్వీకుల నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని ఇటీవల జాతీయ రహదారి 342 నిర్మాణానికి తీసుకున్నారు. బాధితులకు పరిహారం మాత్రం ఇవ్వలేదు. అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో సోమవారం తల్లి బబ్లీ బాయితో కలిసి పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన రాజ్‌కుమార్ నాయక్ సంచిలో తీసుకువచ్చిన క్రిమి సంహారక మందును తాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన పోలీసులు అతని వద్ద నుంచి క్రిమి సంహారక మందు డబ్బాను లాగేసుకున్నారు. అతన్ని అక్కడే ఉన్న పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా లేకపోవడం, ఆన్‌లైన్‌లోనూ వివరాలు లేకపోవడంతో నిబంధనల మేరకు పరిహారం చెల్లించేందుకు వీలు కాలేదని ఆర్డీఓ తెలిపారు. మరోమారు పరిశీలిస్తామని చెప్పారు. పూర్వీకుల నుంచి సాగులో ఉన్నందున ఎలాగైనా న్యాయం చేయాలని రాజ్‌కుమార్ నాయక్, తల్లి బబ్లీ బాయి, బంధువు పెద్ద ఓబులేషు నాయక్‌లు వేడుకున్నారు.
పీజీఆర్‌ఎస్‌లో ఘటన


