ప్రశాంతి నిలయం: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ (అమరావతి) నాయకులు తేల్చిచెప్పారు. సోమవారం ప్రశాంతి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రెవెన్యూ భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఉద్యమ కార్యాచరణను వివరిస్తూ సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వెంటనే 12వ పీఆర్‌సీ అమలు చేయాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమ్మె నోటీసులో భాగంగా జేఏసీ తెలిపిన 29 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ మైనుద్దీన్, రెవెన్యూ అసోసియేషన్ పుట్టపర్తి డివిజన్ ట్రెజరర్ గణేష్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయభారతి, మున్సిపల్ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి శంకర్, కోఆపరేటివ్ శాఖ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటనారాయణ, వీఆర్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షులు చక్రపాణి, సనత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తేల్చిచెప్పిన ఏపీ జేఏసీ
(అమరావతి) నాయకులు
కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేత


