సారూ... సమస్యలు తీర్చండి | - | Sakshi
Sakshi News home page

సారూ... సమస్యలు తీర్చండి

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ప్రశాంతి నిలయం: ‘‘సారూ..సమస్యలపై అర్జీలిచ్చి అలసిపోతున్నాం. అయినా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇకనైనా దయచూపండి..మా సమస్యలు పరిష్కరించండి’’ అంటూ జనం కలెక్టర్‌ను వేడుకున్నారు. సోమవారం ప్రశాంతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై 264 అర్జీలు ఇవ్వగా...వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌..అధికారులతో సమీక్షించారు. ‘పరిష్కార వేదిక’లో అందే అర్జీలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పింఛన్‌ రూ.15 వేలు ఇప్పించండి..

తాను పుట్టుకతోనే దివ్యాంగుడనని, సదరం క్యాంపులో సైతం డాక్టర్లు 90 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించారని, మంచానికే పరిమితమైన తనకు రూ.15 వేల పింఛన్‌ ఇప్పించాలని పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన అమ్మినేని లీలావతి కలెక్టర్‌ను వేడుకుంటూ అర్జీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు తనకు రూ.6 వేల పింఛన్‌ మాత్రమే ఇస్తున్నారని, అది తన జీవనానికి చాలడం లేదన్నారు. వేదిక వద్దకు రాలేక బయటే నిరీక్షిస్తున్న లీలావతిని గమనించిన కలెక్టర్‌ ఆమె వద్దకే వచ్చి సమస్యను తెలుసుకున్నారు. అర్జీ పరిశీలించి అర్హత మేరకు న్యాయం చేయాలని అక్కడే ఉన్న డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు.

రజకులను ఎస్పీ జాబితాలో చేర్చండి..

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చంద్రబాబు పలు మార్లు హామీ ఇచ్చారని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చేర్చారన్నారు. 2018లో అధ్యయన కమిటీ కూడా వేశారన్నారు. వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నాయకులు కలెక్టర్‌ను కోరారు.

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో

జనం గగ్గోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement