ప్రశాంతి నిలయం: కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే త్వరగా నయం చేయవచ్చు. అందుకే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కుష్టు వ్యాధి సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 24 తేదీ వరకూ ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి ముందస్తు గుర్తింపు సర్వే చేపడతారన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని ఽఅధికారులను ఆదేశించారు. అనంతరం సర్వేకి సంబంధించిన అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ సువర్ణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఫైరోజా బేగం, జిలా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ప్రణయ్, డీపీఎంఓ రెడ్డి కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


