ప్రకృతి వ్యవసాయం భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయం భేష్‌

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

బత్తలపల్లి: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని జాంబియా దేశం నుంచి 8 మందితో కూడిన సభ్యుల ప్రతినిధి బృందం కితాబునిచ్చింది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తృతస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన ప్రకృతి ఆధారిత విధానాలు, సంస్థాగత ఏర్పాట్లు, శాసీ్త్రయ ఆధారాలు, విస్తరణ వ్యవస్థలు, ఆర్థిక సహాయ విధానాలు, భాగస్వామ్యాలపై అవగాహన పొందడం కోసం జాంబియా దేశం నుంచి 8 మందితో కూడిన సభ్యుల ప్రతినిధి బృందం జిల్లాలో పర్యటించింది. సోమవారం మండలంలోని గంటాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వారు సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులు ఆచరిస్తున్న వినూత్న విధానాలు, స్థితిస్థాపక వ్యవసాయ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జాంబియా దేశ ప్రతినిధుల బృందం మాట్లాడుతూ.. ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సంస్థాగత ఏర్పాట్లు, శాసీ్త్రయ ఆధారాలు, ఆర్థిక సహాయ విధానాలను అధ్యయనం చేసి తమ దేశంలోనూ అమలు చేస్తామన్నారు. అంతకుముందు ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది సార్వత్రిక సూత్రాలకు సంబంధించిన ప్రదర్శనలను ప్రతినిధి బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారీ విధానాలను కూడా బృందం పరిశీలించింది. రైతు సాధికార సంస్థ చీప్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లక్ష్మానాయక్‌ ప్రకృతి వ్యవసాయంలో జీవ ఉత్ప్రేరకాల ప్రాముఖ్యత, వాటి పాత్ర, నేల ఆరోగ్యం, పంటల పెరుగుదలను మెరుగుపరచడంలో వాటి వినియోగం గురించి వివరించారు.

గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల సందర్శనతో పాటు మహిళా సంఘాలతో పరస్పర చర్చలు జరిపారు. మహిళల పాత్ర గురించి తెలుసుకున్నారు. ఏపీఎంఏఎస్‌ ప్రతినిధులు కలైమని, రమాదేవి సహకారం అందించారు. రైతు సాధికార సంస్థ అధికారులు సీనియర్‌ థిమాటిక్‌ సుధాకర్‌, టిఎల్స్‌ సురేష్‌, స్వాతి, ఎపీసీఎన్‌ఎఫ్‌ జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయం పరిశీలన

మడకశిర రూరల్‌: జిల్లా రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆగా ఖాన్‌ రూరల్‌ సపోర్ట్‌ ప్రోగ్రాం (ఏకేఆర్‌ఎస్‌పీ) చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాల ప్రతినిధుల బృందం పరిశీలించింది. సోమవారం బృందం సభ్యులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు సాగు చేసిన వివిధ పంటలు, ఆర్‌వైఎస్‌ఎస్‌ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌)ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆమిదాలగొందిలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యం, పోషకాహారం, కుటుంబ ఆహార భద్రతకు సంబంధించిన నమూనాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో వారి అనుభవాలు, స్థానిక వనరుల వినియోగం, జీవ వైవిధ్యం, పీఎండీఎస్‌ తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గుడిబండ మండలం బూదిపల్లి, జవనడుకు గ్రామాల్లోనూ ఏకేఆర్‌ఎస్‌పీ ప్రతినిధులు పర్యటించారు. పీఎండీఎస్‌ విత్తనాలు విత్తే విధానాన్ని, ఏ గ్రేడ్‌, ఏటీఎం, పీఎండీఎస్‌ నమూనాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలు గురించి బృందం ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో అవగాహన పెంపొందించుకున్నారు. మూడు రోజుల పాటు బృందం సభ్యులు పంటలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రతినిధులకు మాస్టర్‌ ట్రైనర్‌ వివరించారు. వారి వెంట జాతీయ వనరుల సంస్థ అధిపతి కృష్ణారావు, టెక్నికల్‌ ఏఓలు హుమాయున్‌, సంతోష్‌, ఎన్‌ఆర్‌ఓ, ఏపీసీఎన్‌ఎఫ్‌ బృందం సభ్యులు సయ్యద్‌ దాదాపీర్‌, నవీన్‌, మాస్టర్‌ ట్రైనర్‌ రమేష్‌, శివాజీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

కితాబునిచ్చిన జాంబియా ప్రతినిధి బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement