ద్విచక్ర వాహనం ఢీ – బాలుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం ఢీ – బాలుడికి గాయాలు

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ఎన్‌పీకుంట: ద్విచక్ర వాహనం ఢీకొని ఎన్‌.జనార్ధన అనే బాలుడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఎన్‌.రామాంజులు కుమారుడు జనార్ధన సోమవారం సాయంత్రం బస్టాండ్‌ దగ్గరున్న మూడు రోడ్ల కూడలిలో రోడ్డు దాటుతుండగా ఓ ద్విచక్ర వాహనం వేగంతో వచ్చి బాలుడికి ఢీ కొంది. ఘటనలో జనార్ధనకు తీవ్ర గాయాలు కాగా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

నేడు మహిళా క్రికెట్‌ జట్ల ఎంపిక

అనంతపురం: ఆర్డీటీ క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్‌–15, అండర్‌–18 విభాగాల్లో మహిళా కికెట్‌ జట్లను ఎంపిక చేయనున్నారు. కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బాలికలతో పాటు స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా క్రికెటర్లు ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చన్నారు. ఈ మేరకు ఆర్డీటీ క్రీడా విభాగం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

గుండెపోటుతో టెకీ మృతి

పుట్టపర్తి అర్బన్‌: గుండెపోటుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందడంతో పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాలమేరకు... వెంకటగారిపల్లికి చెందిన కుళ్లాయిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి (40) హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో గుండెపోటు ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్‌ చెప్పడంతో భార్య నవశ్రీ కన్నీరు మున్నీరైంది. విషయం కుటుంబ సభ్యులకు , గ్రామస్తులకు తెలయడంతో వెంకటగారిపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనంతరం గణేష్‌ మృత దేహానికి వెంకటగారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గణేష్‌ పండక్కి వస్తానని చెప్పి వెళ్లాడని, చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా నాయనా అంటూ బంధువులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు.

ఆటో – ద్విచక్ర వాహనం ఢీ

ఇద్దరికి తీవ్ర గాయాలు

ముదిగుబ్బ: మండల పరిధిలోని సంకేపల్లి క్రాస్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆటో – ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గుంజేపల్లికి చెందిన శ్రీధర్‌, బి.కొట్టాల గ్రామానికి చెందిన రాములు తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది మల్లేసు, నారాయణస్వామి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీస్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సచివాలయ ఉద్యోగులకు

బీఎల్‌ఓ, జనగణన పనులొద్దు

అనంతపురం క్రైం: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందాల్సిన సేవలకు ఆటంకం కలగకుండా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సిబ్బందిని ఇతర ప్రభుత్వ విధులకు దూరంగా ఉంచాలని జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి జి.నాసరరెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. ముఖ్యంగా డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులను బీఎల్‌ఓ విధులు, జనగణన, ఇతర సర్వే సంబంధిత పనులకు వినియోగించకూడదని స్పష్టం చేశారు.

50 తులాల బంగారు నగల చోరీ

రాయదుర్గంటౌన్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళను మాటలతో ఏమార్చి బ్యాగులోని 50 తులాల బంగారు నగలను అపహరించారు. ఈమేరకు డీ.హీరేహాళ్‌ మండలం మడేనహళ్లికి చెందిన పుష్పలత రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం పుష్పలత కణేకల్లులోని తన పుట్టింటికి వెళ్లి తిరిగి రాయదుర్గానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కణేకల్లు క్రాస్‌లో ఓ మహిళ బస్సు ఎక్కి పుష్పలత పక్కన కూర్చుంది. స్నేహంగా మాటలు కలిపి పిల్లవాడికి పాలు తాగించేందుకు అంటూ కింద కూర్చొని బ్యాగులో ఉంచిన 50 తులాల బంగారు నగలను దొంగిలించింది. రాయదుర్గం పట్టణానికి చేరుకోగా మొదటి స్టాప్‌లో సదరు మహిళ దిగిపోయింది. బస్సు బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత బ్యాగ్‌ జిప్‌ తీసి ఉండటంతో దొంగతనం విషయం బయట పడింది. దీంతో పుష్పలత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement