● పోలీసుల అదుపులో నిందితుడు
ఉరవకొండ: నియోజకవర్గంలో పలువురు కార్ల యజమానుల నుంచి బాడుగకు కార్లు తీసుకొని వాటిని బయట వ్యక్తులకు తాకెట్టు పెట్టి డబ్బు వసూలు చేసి పరారీలో ఉన్న మోసకారిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉరవకొండ సీఐ మహానంది, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు తెలిపిన వివరాలమేరకు... స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో నివాసమంటున్న అంకె అమరేశ్వర అలియాస్ హనుమంతు పట్టణంలో బాడుగులకు వాహనాలు తిప్పే కార్ల యజమానుల వద్దకు వెళ్లి అధిక బాడుగ చెల్లిస్తానంటూ ఆశ చూపాడని తెలిపారు. అతని మాటలు నమ్మిన కార్ల యజమానులు కార్లు బాడుగలకు ఇచ్చారన్నారు. అయితే వారికి తెలియకుండా హనుమంతు 13 కార్లను బయట వ్యక్తులకు కుదవ పెట్టి డబ్బులు వసూలు చేసి పరారైనట్లు పేర్కొన్నారు. వాహన యజమానుల్లో ఒకరైన ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సోమవారం పాల్తూరు క్రాస్ వద్ద 42వ జాతీయ రహదారి వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 9 కార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు.
మామపై అల్లుడి దాడి
నార్పల: కుటుంబ కలహాలతో మామపై వేటకొడవలితో అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన మండల కేంద్రమైన నార్పలలో కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు... నార్పలలోని తిక్కస్వామివీధిలో నివాసం ఉంటున్న చిలమకూరి పాముల రాజాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ముందే వివాహం జరిపించాడు. చిన్నకుమార్తె రమాదేవికి 18 నెలలు క్రితం లింగాల మండలానికి చెందిన శివయ్య కుమరుడు చరణ్‌తో పెళ్లి చేశారు. కుమార్తె గర్భిణి కావడంతో ప్రసవం కోసం పాముల రాజా తన ఇంటికి పిలుచుకుని వచ్చాడు. నెల రోజుల క్రితం రమాదేవి ప్రసవించింది. బిడ్డను చూసేందుకు చరణ్ తో పాటు అతని తండ్రి శివయ్య వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాల్లో వచ్చిన మనస్పర్థల కారణంగా చరణ్ ... తన మామ అయిన పాముల రాజాపై వేట కొడవలితో దాడి చేశాడు. దాడిలో రాజా కుడి చేతికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆయన బయటకు పరుగులు తీశాడు. చరణ్ అంతటి అగకుండా రాజా వెంటాపడ్డాడు. గమనించిన స్థానికులు చరణ్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. తీవ్రంగా గాయపడిన రాజాను వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా...పైళ్లెనప్పటి నుంచి తనను హింసిస్తున్నాడంటూ భర్త చరణ్‌పై భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


