పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను నింపడానికి గత ప్రభుత్వంలో రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. పలు మండలాలకు పైపులను కూడా తరలించారు. ఈ పథకం పూర్తయితే 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి భగీరథ ప్రయత్నం చేశారు. అయితే, ఎన్నికలు రావడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆ పనులకు గ్రహణం పట్టింది. చెరువులు నిండకపోవడంతో బోర్లలో నీళ్లు రాక వందలాది ఎకరాల్లో ఉద్యాన తోటలు, వేలాది ఎకరాల్లో సాగైన పంటలు ఎండుతున్నాయి. గత ప్రభుత్వంలో పుట్టపర్తి నియోజకవర్గానికి 3 టీఎంసీల నికర జలాలను సాధించుకున్నా నేడు ఉపయోగం లేకుండా పోయింది.
దుర్భర పరిస్థితులు..
వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ఎల్‌నినో తీవ్ర నష్టం చేస్తుండగా చంద్రబాబు అంతకు మించి నష్టం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్షాలు సకాలంలో కురవలేదు. ఈ క్రమంలోనే విత్తనకాయలు అందించకపోవడంతో పాటు హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపకపోవడంతో జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేయకుండా పంట విరామం ప్రకటించగా, చాలా మంది సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2.9 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగు చేయాల్సి ఉండగా లక్ష హెక్టార్లలో కూడా సాగు చేయలేదంటే ఎంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.
స్థానికులకు క‘న్నీళ్లు’
ప్రస్తుతం హంద్రీ–నీవా కాలువ ద్వారా జిల్లాకు వస్తున్న జలాలతో రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేకపోయింది. పుట్టపర్తికి చేరుకున్న హంద్రీ–నీవా జలాలలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురవలేదు. చెరువులు, నదులు పూర్తిగా ఎండిపోయాయి. ఈ క్రమంలో రైతులంతా హంద్రీ–నీవా జలాలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ పూత పూసి జలాలను కుప్పానికి తరలించుకుపోతుండడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
రైతులకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు
పుట్టపర్తి నియోజకవర్గంలో
ఒక్క చెరువూ నింపని వైనం
‘హంద్రీ–నీవా’ సిమెంట్ లైనింగ్‌తో రీచార్జ్ కాని బోరు బావులు
విలవిలలాడుతున్న అన్నదాతలు
రైతుల ఇబ్బందులు పట్టవా..?
రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం చేయలేదు. రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. హంద్రీ–నీవా నీళ్లు జిల్లాలో వాడుకునేందుకు వీలు లేకుండా కుప్పానికి తరలిస్తుండడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. స్థానిక నాయకులు చేతగాని దద్దమ్మల్లా చేష్టలుడిగి చూస్తున్నారు. నియోజకవర్గానికి 3 టీఎంసీల నికర జలాలు సాధిస్తే ఒక్క టీఎంసీ కూడా నిల్వ చేసుకోలేక పోవడం సిగ్గుచేటు. మళ్లీ మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 193 చెరువులు నింపే పనులను కొనసాగించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
పంట ఎండిపోయింది
హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్నా సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. ఇతర రైతుల బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. ఇప్పటికే రూ.2 లక్షల వరకూ ఖర్చు చేశా. ప్రస్తుతం దిక్కు తోచడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే వలసలే శరణ్యం. అధికారులకు ఈ విషయం వివరించా. వెంటనే పరిశీలించి పరిహారం అందించాలి. – పూలకుంట నాగభూషణ, బుక్కపట్నం


