పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయంలో ద్వితీయ శ్రావణ శని వారోత్సవ వేడుకలు అద్వితీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు, దావణగెరె, చిత్రదుర్గం, చెళ్లకెరెతో పాటు అనంతపురం, ధర్మవరం, హిందూపురం, మడకశిర, కళ్యాణదుర్గం ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి శనీశ్వర స్వామిని దర్శించుకుని తైలాభిషేకం, నవగ్రహ పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 4 గంటల నుంచి పంచామృతాభిషేకం, తైలాభిషేకం, నవగ్రహ పూజలు ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ అనంతరాం భట్ నేతృత్వంలో అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శీతలాంభదేవికి మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ దీక్ష మంటపంలో భక్తులు శనీశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నపూర్ణ దాసోహ భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక సీఐ సురేశ్ నేతృత్వంలో ఆలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


