హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్ట్‌

Aug 23 2026 2:16 AM | Updated on Aug 23 2026 2:16 AM

మడకశిర: మండల పరిధిలోని యూ.రంగాపురం గ్రామంలో మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారిసింది. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ క్రిష్ణారెడ్డితో కలిసి సీఐ రాజ్‌కుమార్‌ మాట్లాడారు. ఈనెల 20వ తేదీ సాయంత్రం అశోక్‌ అనే వ్యక్తి నాగరాజు అనే వ్యక్తిని అడ్డగించి బెదిరించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. 21వ తేదీన హనుమంతరాయ, అతని భార్య రాధతో పాటు కుమారుడు నాగరాజు, కుమార్తె సంధ్యతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఎనిమిది మంది ఒకే చోటకు చేరి కర్రలు, రాళ్లతో అడ్డగించి దాడి చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దాడిలో హనుమంతరాయ, నాగరాజు తలకు రక్త గాయాలు కాగా రాధ, సంధ్యకు గాయాలైనట్లు తెలిపారు. సంధ్యపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలిందన్నారు. స్థానికులు బాధితులను రక్షించి 108 ద్వారా మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించా రని తెలిపారు. దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన ఎనిమిది మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశామని తెలిపారు. దాడికి ఉపయోగించిన కర్రలు, రాళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోని మధుగిరి సర్కిల్‌లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నవీన్‌, దినేష్‌, అశోక్‌, వెంకటేష్‌, గంగమ్మ, అశ్వత్థప్ప, అలివేలమ్మ, రామ్మూర్తిని అరెస్ట్‌ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

రాప్తాడు రూరల్‌: అప్పుల ఒత్తిడి తాళలేక ఓ యువ ఆటోడ్రైవర్‌ మృతి చెందిన విషాద ఘటన అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దివంగత నాగభూషణ కుమారుడు మొండి గోవర్దన్‌సాయి (22) అవివాహితుడు. తల్లి జయమ్మతో కలిసి ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గోవర్దన్‌సాయి వివిధ అవసరాల కోసం అక్కడక్కడ అప్పులు చేశాడు. ఇటీవల రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. శుక్రవారం అప్పుల విషయమై తల్లి జయమ్మ కుమారుడిని మందలించినట్లు తెలిసింది. అప్పులు ఎందుకు చేశావంటూ ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన గోవర్దన్‌సాయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆకుతోటపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో గోవర్దన్‌సాయి చెట్టుకు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడి కేసులో నలుగురి అరెస్ట్‌

అనంతపురం సెంట్రల్‌: నగరంలో సోమనాథ్‌నగర్‌లో ఈనెల 20న చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులపై దాడి చేసిన ఘటనలో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వివరాలను శనివారం త్రీటౌన్‌ సీఐ కౌలుట్లయ్య మీడియాకు వెల్లడించారు. భవానీ నగర్‌కు చెందిన గుజ్జల దామోదర్‌, పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన హరికృష్ణ, కనగానపల్లి మండలం పాతపాల్యం గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌, యాడికి మండల కేంద్రానికి చెందిన బండిమేకల కార్తీక్‌ను అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. ఈ నెల 20న రాత్రి 8 గంటల సమయంలో అంకిత చికెన్‌ సెంటర్‌ ముందు మూత్ర విసర్జన చేస్తుండడంతో చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తున్న పవన్‌కుమార్‌ అడ్డు చెప్పాడు. దీంతో సదరు యువకులు రాళ్లు, కట్టెలతో పవన్‌కుమార్‌, రమేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ వివరించారు.

నిర్మాణ సంస్థతో

ఎస్కేయూ ఎంఓయూ

అనంతపురం: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు నిర్మాణ సంస్థతో ఎస్కేయూ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సహకారంతో హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో విద్యార్థులకు ఉచితంగా ఎంప్లాయిబులిటీ, టెక్నికల్‌ స్కిల్స్‌లో శిక్షణ అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ, ధ్రువపత్రాలు, పరిశ్రమలతో పరస్పర సంబంధాలు, ప్లేస్‌మెంట్‌, జాబ్‌ డ్రైవ్‌లు, ఇంటర్న్‌షిప్‌లు తదితర అవకాశాలు కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement