దంపతులపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

దంపతులపై హత్యాయత్నం

Aug 23 2026 2:16 AM | Updated on Aug 23 2026 2:16 AM

తాడిపత్రి రూరల్‌: పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీలో దంపతులపై అల్లరి మూక హత్యాయత్నం చేసింది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రోడ్డులోని ఇటుకల ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాము ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతుండగా, గన్నెవారిపల్లికి చెందిన వెంకటశివ వెళ్లి విడిపించాడు. ఈ క్రమంలోనే రాము, వెంకటశివ మధ్య వాగ్వాదం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న రాము, శివ, మహేష్‌, అంజి, ముక్కు మహేష్‌, విజ్జేష్‌, పబ్జీ, చరణ్‌ తదితరులతో కలిసి శుక్రవారం రాత్రి కట్టెలు, రాళ్లు, బ్యాట్లతో వెంకటశివ ఇంట్లోకి ప్రవేశించి దాడికి దిగారు. ఇంట్లోని సామాన్లను చెల్లాచెదురు చేశారు. ఇంటి ముందున్న కారు, మోటార్‌ సైకిల్‌ ధ్వంసం చేశారు. దాడిలో వెంకటశివతోపాటు అతని భార్యకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అప్‌గ్రేడ్‌ సీఐ నారాయణరెడ్డి వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వెంకటశివ ఫిర్యాదు మేరకు నిండితులపై సీఐ కేసు నమోదు చేశారు.

– మరోవైపు తనపై వెంకటశివ, నాగరాజు, మధు తదితరులు ఇటుకల ఫ్యాక్టరీ వద్ద దాడికి దిగారని రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

అగ్నిమాపక సేవలు బలోపేతం

అగ్నిమాపకశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ వెంకటరమణ

అనంతపురం సెంట్రల్‌: అత్యవసర సమయాల్లో మెరుగైన సేవలందించేందుకు అగ్నిమాపక సేవలను బలోపేతం చేస్తున్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ వెంకటరమణ తెలిపారు. శనివారం జిల్లా అగ్నిమాపకశాఖ కార్యాలయంలో డీఎఫ్‌ఓ శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా మంజూరు చేసిన అగ్ని నియంత్రణ పరికరాలు, వాహనాల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో కేంద్రానికి రూ.2.25 కోట్లతో 17 నూతన భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మరో 36 కేంద్రాలలో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు వివరించారు. కొత్తగా 123 వాహనాలను కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు మంజూరు చేశామన్నారు. అధునాతన వాహనాలను గ్రామీణ, అటవీ ప్రాంతాలలో ఎక్కువశాతం వినియోగించాలని నిర్ణయించామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని, త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. కళ్యాణదుర్గంలో త్వరలో 60 సెంట్లలో రూ. 2.25 కోట్లు వెచ్చించి పక్కా భవనం నిర్మిస్తున్నట్లు వివరించారు. గుత్తి, శింగనమల, రాప్తాడులో ఫైర్‌స్టేషన్‌ల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకూ పోలీసు సేవలకు వినియోగిస్తున్న 112 కాల్‌ సెంటర్‌ను త్వరలో అగ్నిమాపక శాఖకు కూడా అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు బహుమతులు, మెడల్స్‌ బహుకరించారు. కార్యక్రమంలో జిల్లాలోని అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement