● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
కుందుర్పి: మండలంలోని మహంతపురం–కుందుర్పి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహంతపురానికి చెందిన రైతు సోమశేఖర్ (32) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు... సోమశేఖర్ కుందుర్పిలో సొంత పని ముగించుకొని గురువారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అయితే సిద్ధేస్ అలియాస్ మారుతీ అనే వ్యక్తి మహంతపురం నుంచి వ్యాన్‌లో పాలక్యాన్లను తన స్వగ్రామమైన అమరాపురానికి తీసుకెళ్తున్నాడు. రవి రైస్ మిల్ వద్దకు రాగానే పాలకాన్లవ్యాన్.. ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సోమశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే సోమశేఖర్ చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మకూరు: మండల పరిధిలోని పంపనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి మారెన్న (85) మృతి చెందారు. ఎస్‌ఐ లక్ష్మణరావు వివరాలమేరకు.. ఆటోడ్రైవర్ పెద్దన్న అనంతపురం నుంచి ఆత్మకూరుకు ప్రయాణికులతో ఆటోలో బయలు దేరారు. అయితే పంపనూరు వద్ద మూత్ర విసర్జన కోసం ఆటోను రోడ్డు పక్కన ఆపారు. మారెన్న, డ్రైవర్ పెద్దన్న మాత్రం ఆటోలోనే ఉండగా మిగతావారు కిందకు దిగారు. ఈ సమయంలోనే అనంతపురం నుంచి వస్తున్న బొలెరో వేగంగా వచ్చి నిలిచివున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మారెన్న, పెద్దన్నలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మారెన్న మృతి చెందాడు. బొలెరో వాహనంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి మృతి
రాయదుర్గం రూరల్: మండలంలోని వేపరాళ్ల గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లికెర పట్టణానికి చెందిన డ్రైవర్ అంజనమూర్తి (42) మృతి చెందాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వేపరాళ్ల గ్రామంలో తన మామ పెద్ద దుర్గప్ప పెద్ద కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే కంకర లోడుతో వేపరాళ్ల గ్రామంలోకి వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వసున్న అంజనమూర్తిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అంజనమూర్తిని బంధువులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సత్యన్న (ఫైల్), మృతురాలు చిన్నారి గాయత్రి
తండ్రీ కుమార్తె మృతి
గుమ్మఘట్ట: రాయదుర్గం పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కుమార్తె దుర్మరణం పాలయ్యారు. స్థానికులు , పోలీసుల వివరాల మేరకు.. పూలకుంటకు చెందిన సత్యన్న (28) కూలి పనులు చేసుకుని జీవించేవాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సత్యన్న తన భార్య సరస్వతి, కుమార్తె గాయత్రి (5), కుమారుడు మణికంఠతో కలసి పనినిమిత్తం రాయదుర్గం పట్టణానికి ద్విచక్ర వాహనంపై వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. అయితే పట్టణం దాటిన తర్వాత బీటీపీ లే అవుట్ వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో సత్యన్న, సరస్వతి, మణికంఠ, గాయత్రి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సత్యన్న మృతి చెందాడు. గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. సరస్వతి, మణికంఠ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనతో పూలకుంటలో విషాదఛాయలు నెలకొన్నాయి. ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


