బొమ్మనహాళ్: ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయాలని రైతులు, కార్మికులు రోడ్డెక్కారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలోని కళ్యాణదుర్గం–బళ్లారి అంతరాష్ట్ర రహదారిపై వరి నార్ల కట్టలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో 95 టీఎంసీల నీరు నిల్వ ఉందని, హెచ్చెల్సీ కాలువ ద్వారా నీరు వస్తున్నాయని వాటిని కేవలం తాగునీటి మాత్రమే వాడుకుంటున్నట్లు తెలిపారు. కళ్ల ఎదుటే కాలువలో నీరు ప్రవహిస్తున్నా...రైతులకు సాగుకు మాత్రం నీటిని విడుదల చేయకపోవడం దారుణమన్నారు. గతంలో జలాశయంలో 75 టీఎంసీల నీరు ఉన్నప్పుడే తాగు, సాగుకు నీరు అందించారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రెండు గంటలసేపు రోడ్డుపై ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎస్‌ఐ నబీరసూల్ సిబ్బందితో ఘటన స్ధలానికి చేరుకుని, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ఈనెల 25లోగా సాగునీరు విడుదల చేయకపోతే సీఐటీయూ, రైతు సంఘాలు, రైతులతో కలిసి డిస్ట్రిబ్యూటరీల గేట్లను ఎత్తి కాలువల ద్వారా నీటిని విడుదల చేసుకుంటామని నిరసనకారులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులేసు, రైతు సంఘం నాయకులు శ్రీనివాసులు, జయచంద్రరెడ్డి, హరినాథ్‌రెడ్డితో పాటు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
వజ్రకరూరు: మండల పరిధిలోని రాగులపాడు సమీపంలోని ధర్మపురం డిస్ట్రిబ్యూటరీ తూము వద్ద శుక్రవారం సాయంత్రం గణేహోతురు, చిన్న హోతురు, చాబాల గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ధర్మపురి డిస్ట్రిబ్యూటరీకి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ హంద్రీ–నీవా నీరు వస్తాయన్న ఆశతో పంటలు సాగు చేశామన్నారు. వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టాయన్నారు. పంటల కోసం రూ.లక్షలు పెట్టుబడి పెట్టామని, నీటి విడుదల ఆలస్యమైతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కళ్లముందే నీరు పోతున్నా వాడుకోలేని పరిస్థితులు వచ్చాయన్నారు. హంద్రీనీవా ఏఈ సురేష్‌నాయక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు.
వజ్రకరూరు: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో మాట్లాడుతున్న రైతులు
బొమ్మనహాళ్: ధర్నా చేస్తున్న సీఐటీయూ, రైతు సంఘం నాయకులు, ఆయకట్టు రైతులు


