గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు, ఎస్‌ఐ అమీర్‌ఖాన్ తెలిపిన వివరాలమేరకు... గుత్తి–తాడిపత్రి మార్గంలో తొండపాడు గ్రామ శివారులో ఈ నెల 5న రాత్రి గుర్తు తెలియని వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడి ఉన్నాడు. స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుపత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 18న వృద్ధుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 9346010582, 9346917082, 9550525101 సెల్‌ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మాజీ సైనికుడి ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్: పట్టణంలోని మోదినాబాద్ పైకొట్టాల చెందిన మాజీ సైనిక ఉద్యోగి తిక్కయ్య ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలను బద్దలుకొట్టి బీరువాలోని 6 తులాల బంగారు నగలు, 24 తులాల వెండి, రూ.80 వేల నగదును అపహరించారు. బాధితుడి వివరాల మేరకు.. తిక్కయ్య ఇంటికి ఆనుకుని మరో ఇల్లు ఉంది. ప్రతిరోజూ రాత్రి ఆ ఇంట్లో తిక్కయ్య తల్లి గౌరమ్మ నిద్రించేది. గురువారం ఆమె ఆదోనిలోని తన బంధువుల ఇంటికి వెళ్లడంతో తిక్కయ్య రాత్రి ఆ ఇంటికి తాళాలు వేశాడు. శుక్రవారం ఉదయం నిద్రలేచి చూసేసరికి చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో చోరీ జరిగిన ఇంటిని వన్‌టౌన్ పోలీసులు పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు క్లూస్‌ను సేకరించారు. చోరీకి సంబంధించి తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.
చెలరేగిన వీరార్జునులు
అనంతపురం: జిల్లా బ్యాటర్లు కేహెచ్ వీరారెడ్డి, అర్జున్ టెండూల్కర్ చెలరేగడంతో అనంత జట్టు భారీ స్కోర్ సాధించింది. ఏసీఏ మల్టీడే మ్యాచ్‌ల్లో భాగంగా శుక్రవారం అనంత క్రీడాగ్రామంలో కడప జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అనంత జట్టు మొదటి ఇన్నింగ్స్‌నను 64 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించింది. 102 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 424 పరుగులు సాధించింది. బ్యాటర్ పి.అర్టున్ టెండూల్కర్ 177 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ కేహెచ్ వీరారెడ్డి 187 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 124 పరుగులు సాధించాడు. వైఎస్సార్ కడప జట్టు బౌలర్లలో ఆదిల్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టాడు. కాగా, కడప జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
● రాయలసీమ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో చిత్తూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి. చిత్తూరు జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించగా, కర్నూలు జట్టు మూడు వికెట్లు కోల్పోయి 99 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన కర్నూలు జట్టు 70.5 ఓవర్ల వద్ద 242 పరుగులకు ఆలౌట్ అయింది. మురారీ హృదయ్ 118 పరుగులు (నాటౌట్)గా నిలిచాడు. చిత్తూరు బౌలర్లలో సాయిచరణ్, బాలాజీ చెరో రెండు వికెట్లు, రాజ్‌దీప్ జాచిన్ నాలుగు వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 31.3 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 169 పరుగులకు పరిమితమైంది. కర్నూలు బౌలర్ అక్షిత్‌రెడ్డి ఐదు వికెట్లు, సాయితేజారెడ్డి ఐదు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి కర్నూలు జట్టు 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 41 పరుగులు సాధించింది. నయీముల్లా 29 పరుగులు, మురారీ హృదయ్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఆటోకు నిప్పు
కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని మారంపల్లి కాలనీలో ఇంటి ముందు ఉంచిన ఆటోకు దుండగులు నిప్పుపెట్టిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు... మారంపల్లి కాలనీకి చెందిన బోయ నరేంద్ర ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రోజులానే ఆటో నడిపి ఇంటి ముందు ఉంచి ఉదయం లేచి చూడగా ఆటో కాలిపోయి కనిపించింది. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం
సెంచరీలు సాధించిన అర్జున్ టెండూల్కర్, కేహెచ్ వీరారెడ్డి


