అటకెక్కిన ‘నాన్‌ అమృత్‌ పథకం’ పనులు | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ‘నాన్‌ అమృత్‌ పథకం’ పనులు

Aug 19 2026 12:54 AM | Updated on Aug 19 2026 12:54 AM

పుట్టపర్తి అర్బన్‌: రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లోని వారికి తాగునీరందించిన సత్యసాయి నడయాడిన పుట్టపర్తిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాన్‌ అమృత్‌ పథకంలో భాగంగా ట్యాంకులు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణాలను ప్రారంభించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులను అటకెక్కించడంతో తరచూ తాగునీటి ఇబ్బందులతో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది.

రూ.18 కోట్లకు పైగా ఖర్చు

పుట్టపర్తి మున్సిపాలిటీ నుంచి జిల్లా కేంద్రం కావడంతో వేలాది మంది పుట్టపర్తి చేరుకున్నారు. దీంతో తాగునీటి వినియోగం బాగా పెరిగింది. రూరల్‌ ప్రాంతాల్లో విపరీతంగా నూతన గృహాలు వెలిశాయి. పుట్టపర్తికి తాగునీరు అందించడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.వంద కోట్ల వ్యయంతో తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. వివిధ నిర్మాణ పనులకు రూ.18 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నీళ్లు లేక ఎండిపోయింది. దీంతో పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని, త్వరగా తాగునీటి పథకం పనులు పూర్తి చేసి నీళ్లు సరఫరా చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

బుక్కపట్నం చెరువు నుంచి...

బుక్కపట్నం చెరువులో ఏర్పాటు చేసే ఇన్‌టెక్‌ వెల్‌ ద్వారా నీరు సరఫరా చేస్తూ స్థానిక ప్రశాంతి గ్రామంలో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో నీటిని శుద్ధి చేయాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి, బ్రాహ్మణపల్లి, ప్రశాంతి గ్రామం, పెద్ద కమ్మవారిపల్లి, ఎనుములపల్లి, చిత్రావతి గుట్ట, ఎద్దులకొండ, కర్ణాటక నాగేపల్లి వంటి 8 చోట్ల ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించి వాటి నుంచి మంచి నీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఆగిపోయిన పనులు

ఇందులో భాగంగా రూ.18 కోట్ల పనులు గతంలోనే పూర్తి చేశారు. అలాగే నాలుగు ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. బుక్కపట్నం చెరువులో నిరంతరాయంగా నీరు నిలువ ఉండడంతో పనులు అసంపూర్తిగా జరిగాయి. అలాగే ప్రశాంతి గ్రామం సమీపంలో నిర్మిస్తున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను రెండేళ్లుగా ఆగిపోయాయి. నిర్మాణం పిల్లర్ల దశలో నినిలిచిపోవడంతో అవి కాస్తా దిష్టిబొమ్మల్లా మారాయి. కొన్ని పిల్లర్లకు, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు వేసిన ఇనుప చువ్వలు తుప్పు పట్టాయి. ఇక.. నిర్మాణ పనులకు ఉపయోగించే సిమెంట్‌ బస్తాలు సుమారు 40కుపైగా గడ్డకట్టి పాడైపోయాయి.

టెండర్లు రద్దు

గత ప్రభుత్వంలో సుమారు 18 శాతం పూర్తయిన పనులకు సంబంధించి టెండర్లు రద్దు కావడంతో నాన్‌ అమృత్‌ పథకం మూలన పడింది. ప్రస్తుత ధరల ప్రకారం వాటికి టెండర్లు పిలవడానికి ఎస్టిమేషన్‌ వేయగా సుమారు రూ.144 కోట్లకు చేరుకుంది. గతంలో మేఘా కంపెనీ పనులు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ టెండర్లు రద్దు చేసి హైబ్రిడ్‌ యూనిట్‌ మోడల్‌ తరహాలో రాయలసీమలోని 8 జిల్లాలో ఉన్న తాగునీటి పనులన్నీ కలిపి ఒకే టెండర్‌ పిలవనున్నారు.

పూర్తికాని టీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు

పలుచోట్ల తాగునీటికి ప్రజల ఇక్కట్లు

రిపోర్టు రాగానే పనులు

నాన్‌ అమృత్‌ పథకం పనులకు ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఆ తర్వాత పనులు ప్రారంభిస్తారు. ప్రస్తుతం జరిగిన 18 శాతం పనులను పర్యవేక్షించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. నాణ్యతపై పరిశీలన జరిపి రిపోర్టు వచ్చిన తర్వాతే పనులు చేస్తాం.

– నరసింహమూర్తి, డీఈ, పబ్లిక్‌ హెల్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement