విడపనకల్లు: ఉండబండ వీరభద్రస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా సాగింది. ఉమ్మడి అనంత, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం వీరభద్రస్వామి, భద్రకాళికాదేవిల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి రథంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు రథాన్ని ఎదురు బసవన్న గుడి వరకు లాగారు. వీరభద్రస్వామి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాల్తూరు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు
పక్కాగా భూముల రీసర్వే
కనగానపల్లి: రైతులకు ఎలాంటి భూ వివాదాలు, సమస్యలు లేకుండా రీసర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెకర్టర్ మౌర్య భరద్వాజ్ మండల రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. మండలంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలించారు. మండలంలోని కనగానపల్లి, తగరకుంట గ్రామాల్లో పర్యటించారు. తగరకుంటలో రీసర్వే జరుగుతున్న రైతుల పొలాల దగ్గరకు వెళ్లి మ్యాపులు పరిశీలించి వాటి ద్వారా భూముల హద్దులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన కనగానపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రికార్డులు తనిఖీ చేశారు. తర్వాత రీసర్వే పూర్తయిన ముత్తువకుంట్లలో జాయింట్ ఎల్‌పీఎంల విభజనపై సర్వేయర్లతో మాట్లాడారు. విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా సంబంధిత భూ యజమానులకు ఈ–కేవైసీ నోటీసులు జారీ చేయాలన్నారు. అనంతరం కనగానపల్లి, మద్దెలచెరువు గ్రామాల్లో రైతుల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై తహసీల్దార్ మనోజ్‌కుమార్‌తో చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జీ.వీ. ప్రసాద్, మండల సర్వేయర్ కరుణాకర్, పలువురు రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.


