పెనుకొండ రూరల్: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం చోలేమర్రి గ్రామానికి చెందిన రామచంద్ర, అంజినమ్మ కుమారుడు అనిల్ (23) పెనుకొండ మండలంలోని మావటూరు గ్రామంలో తన అమ్మమ్మ రామాంజినమ్మ వద్ద ఉంటున్నాడు. కియా అనుబంధ పరిశ్రమ ‘సియాన్’లో అనిల్ కార్మికుడిగా పనిచేసేవాడు. నిత్యం బస్సులో పరిశ్రమకు వెళ్లి వచ్చేవాడు. సోమవారం రాత్రి నైట్ షిఫ్ట్‌కు వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ, మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఒళ్లంతా కాలిన గాయాలతో విగతజీవిలా కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమందించగా, వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలోనే డీజిల్ క్యాన్‌ను గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


