ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలు, హాస్టళ్లు, కేజీబీవీలను నెట్ జీరో హెల్డీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో డీఆర్‌డీఏ, నెట్ జీరో హెల్డీ క్యాంపస్ జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ సభ్యులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, వర్షపు నీటి నిల్వ గుంతలు, కంపోస్ట్ గుంతలు ఏర్పాటుకు సంబంధించిన వివిధ దశల్లో ఉన్న పనుల అంచనా ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసి సాంకేతిక అనుమతుల మంజూరుకు సమర్పించాలన్నారు. అటవీశాఖ అధికారులు అవసరమైన మొక్కల లభ్యతను గుర్తించి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి నెడ్‌క్యాప్ అధికారులు తక్షణమే అంచనాలు రూపొందించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజేంద్రకుమార్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్‌రామ్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, నెడ్‌క్యాప్ ప్రతినిధి కిషోర్, జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


