‘టెట్‌’కు 64 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

‘టెట్‌’కు 64 మంది గైర్హాజరు

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (ఏపీ టెట్‌) రెండోరోజు గురువారం 64 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. బెంగళూరులోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షలకు జిల్లా నుంచి 211 మంది హాజరు కావాల్సి ఉండగా, 147 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన తొలి సెషన్‌లో 11 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌ పరీక్షకు 200 మంది హాజరైనట్లు వెల్లడించారు. రెండు సెషన్లు కలిపి 64 మంది గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు.

నేటి నుంచి‘రైతన్నా మీకోసం’

ప్రశాంతి నిలయం: ‘‘ఎల్‌నినో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి’’ అన్న అంశంపై రైతులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, అనుంబంధ శాఖల అధికారులు పాల్గొంటారని, ఎల్‌నినో కారణంగా నెలకొన్న పరిస్థితులను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక గురించి వివరిస్తారన్నారు. రైతులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సీఐ వ్యవహారంపై విచారణ

హిందూపురం టౌన్‌: పట్టణ సీఐ రాజగోపాల్‌నాయుడి వ్యవహార శైలి, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. సీఐ రాజగోపాల్‌ నాయుడు అధికార టీడీపీతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పురంలో ‘పచ్చ’ పోలీసు శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సీఐ రాజగోపాల్‌ నాయుడు వ్యవహార శైలి, ఇటీవల ఓ దళిత లాయరుపై బూటుకాలితో ఆయన చేసిన దాడి తదితర వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. అంతేకాకుండా కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామి విచారణాధికారిగా నియమించారు.

లాయరునే బూటుకాలితో తన్నిన సీఐ

ఇటీవల గర్భిణి రమ్యశ్రీ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుకూ మృతి చెందింది. బాధితుల తరఫున అక్కడికి వచ్చిన దళిత న్యాయవాదిపై సీఐ రాజగోపాల్‌ నాయుడు దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడి బూటుకాలుతో తన్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులతో పాటు న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ రాజగోపాల్‌నాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఎస్పీ సతీష్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సీఐ పనితీరును వివరిస్తూ ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలోనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, భద్రతా సిబ్బందితో విచారణ చేపట్టారు.

ఎర్రపల్లిలో

రాయల శాసనం లభ్యం

గోరంట్ల: మండల పరిధిలోని ఎర్రపల్లి గ్రామంలో శ్రీకృష్ణదేవరాలయ కాలంనాటి శాసనాన్ని కనుగొన్నట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు గురువారం ఆయన ఎర్రపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ దేవత బొడ్డ్డెమ్మ విగ్రహాన్ని పరిశీలించారు. ఆ శిలపై ఉన్న శాసనాలను క్షుణంగా పరిశీలించారు. శిల రూపంలో ఉన్న బొడ్డ్డెమ్మదేవత విగ్రహం పైభాగంలో తెలుగులో రాసిన శాసనంతో పాటు కింది భాగంలో సంస్కృతంలో లిఖించిన శాసనాన్ని గుర్తించారు. శాసనంపై ఉన్న లిపి ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలకాలం నాటి శాసనంగా ఆయన నిర్ధారించారు. వాస్తవానికి గ్రామ దేవతలకు ఎలాంటి రూపం ఉండదని, కేవలం గుండ్రటి రాయిని గ్రామం మధ్యలో ఏర్పాటు చేసుకొని గ్రామస్తులు దేవతగా పూజిస్తారని మైనాస్వామి తెలిపారు. ఈక్రమంలోనే ఎర్రపల్లి వాసులు రాయలకాలం నాటి శాసనం ఉన్న రాయిని గ్రామదేవత విగ్రహంగా భావించి పూజలు చేస్తున్నారన్నారు. ఆయన వెంట గ్రామస్తులు సురేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement