ప్రశాంతి నిలయం: పంట కోల్పోయిన మామిడి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కోరారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం చెల్లించిన మామిడి రైతులకు వెంటనే బీమా పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో 2024–25 సంవత్సరంలో 2,353 మంది రైతులు మామిడి పంటకు సంబంధించి రూ.90.65 లక్షల ప్రీమియం చెల్లించారని, ప్రభుత్వం ఇంత వరకు బీమా పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిహారం చెల్లించేలా ఏర్పాటు చేయాలన్నారు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవుటాల రమణారెడ్డి మాట్లాడుతూ, పంటలు కోల్పోయి ఏడాది దాటినా పరిహారం ప్రకటించలేదన్నారు. ఇదే విషయమై గతంలో బీమా కంపెనీ(ఏఐసీ) ప్రతినిధులను సంప్రదించగా... ప్రభుత్వం రెయిన్ ఫాల్ డేటా ఇవ్వలేదని తెలిపారన్నారు. ప్రస్తుతం ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయ్యే వరకూ 2025 బీమా పరిహారం చెల్లింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తగదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బీమా పరిహారం అందేలా చూసి మామిడి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సాయి, మాజీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరసింహులు, ఎస్సీ సెల్ నియోజకవర్గ ప్రదాన కార్యదర్శి రామయ్య, బుక్కపట్నం మండల పార్టీ ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, రైతులు సందీప్ చౌదరి, గోపాల్‌రెడ్డి, చిన్న గోపాల్‌రెడ్డి, చిన్నపరెడ్డి, వెంకటరెడ్డి, నాగ ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2024–25లో ప్రీమియం చెల్లించిన వారికి పరిహారం ఇప్పించండి
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు


