● హంపాపురం సబ్‌స్టేషన్ వద్ద
రైతుల ఆందోళన
ఐదు వికెట్లు తీసిన మల్లికార్జున
151 పరుగులు చేసిన వాసుదేవరాజు
రాప్తాడు రూరల్: మండల పరిధిలోని హంపాపురం గ్రామ సబ్‌స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని రైతులు గురువారం హంపాపురం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోజుకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ అందించడం లేదని, కేవలం 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని గొందిరెడ్డిపల్లి, హంపాపురం, గొల్లపల్లి, ఎర్రగుంట గ్రామాల రైతులు కొన్ని రోజులుగా తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో 9 గంటల పాటు విద్యుత్ అందుతుండగా, తమకు మాత్రం కేవలం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. మూడు గంటలు, నాలుగు గంటల చొప్పున విడతల వారీగా సరఫరా చేస్తూ, మధ్యలో తరచూ కోతలు విధిస్తున్నారన్నారు. రెండు రోజులుగా మూడు గంటలకు పైగా అదనపు కోతలు విధించడంతో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడి పంటలను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వేరుశనగ, టమాట, అరటి, చీనీ తదితర పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సంబంధిత విద్యుత్‌శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్తే, ‘కరెంటు వచ్చినప్పుడే వాడుకోవాలి, మా వల్ల ఏమీ కాదు‘ అనే నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆవును ఢీ కొట్టిన ఆటో
● మహిళ మృతి
అనంతపురం సెంట్రల్: గుత్తిరోడ్డు డీమార్ట్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల వివరాల మేరకు... గురువారం రాత్రి 8 గంటల సమయంలో కల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ దూద్‌పీరా గుత్తిరోడ్డు నుంచి పామిడికి బయలుదేరాడు. సోమలదొడ్డికి చెందిన బాలకొండమ్మ (45) కూడా అదే ఆటో ఎక్కింది. గుత్తిరోడ్డు డీ మార్ట్ సమీపంలోకి రాగానే ఆవు అడ్డుగా వచ్చింది. తప్పించబోయి ఆటోతో ఢీ కొట్టాడు. ఆటో ఫల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బాల కొండమ్మ ఆటో కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ దూద్‌పీరాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రయాణికుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాఫిక్ సీఐ వెంకటేష్‌నాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
మైనాపురంలో భారీ చోరీ
గుంతకల్లు రూరల్: మండలంలోని ఓబుళాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో గురువారం భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాలమేరకు... మైనాపురానికి చెందిన పులికొండ అనే వ్యక్తి గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. అతడి భార్య కూడా చీనీకాయల కోత పనులకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న కుమారుడు బయటకు వెళ్తూ యథావిధిగా ఇంటికి తాళం వేసి బాత్‌రూములో ఒకచోట పెట్టి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన దొంగలు తాళాలు తీసుకొని ఇంట్లో చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.5.7 లక్షల నగదు, 62 తులాల వెండి, మూడు తులాల బంగారాన్ని అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారిస్తున్నారు.
చెలరేగిన మల్లికార్జున
అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగుతున్న ఏసీఏ సీనియర్ అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ మల్లికార్జున రాణించాడు. గురువారం ఏసీజీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్ల వద్ద పది వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో తేజారెడ్డి (54), మాధవరాయుడు (44) తప్ప ఎవరూ రాణించలేకపోయారు. అనంత బౌలర్లలో జి.మల్లికార్జున 13.4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ దీపక్ 17 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 69 పరుగులు సాధించింది. కాగా, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైఎస్సార్ కడప జట్టు 75.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 339 పరుగులు సాధించింది. జట్టులోని వాసుదేవరాజు అద్భుతమైన ఆట తీరుతో 151 పరుగులు సాధించాడు. అదే సమయంలో వర్షం మొదలు కావడంతో ఆటను నిలిపి వేశారు.


