పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ భవనాలు దిష్టిబొమ్మల్లా మారాయి. రూ.కోట్లతో నిర్మించిన భవనాలు నిరుపయోగం కావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 544 వార్డు/గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 350 చోట్ల సొంత భవనాలను నిర్మించి ప్రారంభించారు. తక్కినవి నిర్మాణ దశలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై శీతకన్ను వేసింది. కొన్ని చోట్ల ప్రారంభించిన భవనాలు సైతం వినియోగంలోకి తీసుకురాకపోవడంతో దెబ్బతింటున్నాయి. అలాగే, 201 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు కూడా పూర్తిచేయడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు.
అందుబాటులోకి రాని మల్టీపర్పస్ గోడౌన్లు..
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోకుండా నిల్వ చేయడానికి గత ప్రభుత్వం మల్టీపర్పస్ గోడౌన్లను నిర్మించింది. 40 సెంట్ల విస్తీర్ణంలో ఒక్కో గోడౌన్ నిర్మించారు. జిల్లాలో మూడు విడతల్లో 236 గోడౌన్లు మంజూరు కాగా, అప్పట్లోనే 32 గోడౌన్ల నిర్మాణం పూర్తయింది. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే రైతు ఎలాంటి సమయంలోనైనా నిశ్చింతగా ఉండవచ్చు. పంట ఉత్పత్తులే గాక అధిక మొత్తంలో ఎరువులు, విత్తనాలు వచ్చినా నిల్వ చేసుకునే వీలుంది. వీటిలో చిన్న మరమ్మతులు, ప్రహరీలు ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
అగ్రీ ల్యాబ్‌లనూ వదిలేశారు!
ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటి వాటిని పరీక్షించిన తరువాతే మార్కెట్‌లోకి తీసుకురావడానికి గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక అగ్రీ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కోటి రూ.55 లక్షలతో నిర్మించారు. ప్రహరీలకు మరో రూ.10 లక్షలు వెచ్చించారు. జిల్లాలోని ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, కదిరి, పెనుకొండ మడకశిర నియోజకవర్గాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేశారు. ఆరు నియోకజవర్గాలకు రూ.3.90 కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం వీటిని ఎక్కడా వినియోగించక పోవడంతో శిథిలమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ అగ్రీ ల్యాబ్‌లు వినియోగంలోకి తీసుకొస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. పంటలకు ఆశించే చీడ పీడలకు విరుగుడు కనుక్కోవడంతో పాటు నకీలీలకు చెక్ పడుతుంది. మంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభిస్తే రైతులు సంతోషంగా ‘సాగ’వచ్చు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే అన్ని భవనాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
బత్తలపల్లి వద్ద ప్రారంభించి వదిలేసిన గ్రామ సచివాలయ భవనం
కొత్తచెరువులో నిరుపయోగంగా ఉన్న అగ్రీ ల్యాబ్
రూ.కోట్లతో నిర్మించిన భవనాలు నిరుపయోగం
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
మండిపడుతున్న ప్రజలు


