●సురక్షితంగా బయటపడిన విద్యార్థులు
గోరంట్ల: మండల పరిధిలోని ఖాజాపురం సమీపంలో ఓ స్కూల్ బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లింది. బుధవారం మంగళకర ప్రయివేట్ పాఠశాలకు చెందిన బస్సు గోరంట్ల నుంచి జగరాజుపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో ముగ్గురు విద్యార్థులుండగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చర్చించుకున్నారు.
కేబుల్ వైర్ల దొంగల అరెస్టు
గాండ్లపెంట: కేబుల్ వైర్ల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి వెల్లడించారు. మలమీదపల్లికి చెందిన చాంద్‌బాషా, కత్తి సోమశేఖర్‌లు గాండ్లపెంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల వ్యవసాయ బోర్ల వద్ద కొన్ని రోజులుగా కేబుల్ వైర్లు చోరీ చేసేవారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బుధవారం నిందితులను అరెస్టు చేసి రూ.1,91,000తో పాటు 1.5 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు కాని 100కు కానీ డయల్ చేయాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ సుమతి, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం నష్టపోయిన పలువురు రైతులకు నగదు అందించారు.
భూమి కబ్జా చేసిన
టీడీపీ నాయకుడు
కదిరి టౌన్: టీడీపీ నాయకుడు బంగారు క్రిష్ణమూర్తి వాల్మీకి సంఘం పేరుతో 3 ఎకరాల భూమిని కబ్జా చేశాడని కదిరి వాల్మీకి సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కదిరి తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేపట్టారు. సర్వే నంబర్ 83లో 2 ఎకరాల 96 సెంట్లను క్రిష్ణమూర్తి కబ్జా చేశాడన్నారు. గతంలో తహసీల్దార్‌గా పూల అశ్వర్థనారాయణ ఉన్న సమయంలో కబ్జాకు పాల్పడ్డాడన్నారు. క్రిష్ణమూర్తి భార్య విజయలక్ష్మి పేరుమీద ఉన్న పాసుబుక్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ నిరుపేదలైన వాల్మీకులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, లేకుంటే కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు ఈశ్వర్,బొట్టు చంద్ర,ఆవుల శీన,అంజి,బాలరాజు,గంగరాజు,సుబ్బమ్మ, లక్ష్మిదేవి,సోము తదితరులు పాల్గొన్నారు.
ఆ టీచర్లకు షోకాజ్
ఎన్‌పీ కుంట: స్థానిక కేజీబీవీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయినులకు ఉన్నతాధికారులు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్‌ఓ రిహానా, హిందీ టీచర్ రూపారాణిలు మంగళవారం విద్యార్థుల ముందే ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఎన్‌పీ కుంట ఎంఈఓ–2 సుబ్బిరెడ్డి, కదిరి ఎంఈఓ ఓబులరెడ్డి, గాండ్లపెంట ఎంఈఓ–2 శ్రీనివాసులు బుధవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను విచారించారు. విద్యార్థినులతో ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. ఇరువురికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రీ సర్వే పనులపై జేసీ ఆరా
లేపాక్షి: స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. మండల పరిధిలో జరుగుతున్న భూముల సర్వేపై సమీక్ష నిర్వహించారు. లేపాక్షి, పులమతి, కొండూరు, కోడిపల్లిల్లో రీ సర్వే పురోగతి, హద్దుల గుర్తింపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే సంబంధిత ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణమే స్పందించాలన్నారు. హద్దుల గుర్తింపు, పాస్ పుస్తకాల జారీలో పారదర్శకత పాటించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కుమార్‌స్వామిరెడ్డి పాల్గొన్నారు.


