సంతకం ఫోర్జరీ.. కలెక్టర్‌కే తప్పుడు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సంతకం ఫోర్జరీ.. కలెక్టర్‌కే తప్పుడు ఫిర్యాదు

Jul 30 2026 12:09 AM | Updated on Jul 30 2026 12:09 AM

అధికారులను ఆశ్రయించిన బాధితుడు

గాండ్లపెంట: జిల్లా కేంద్రంలో ఈ నెల 27న జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు తన పేరున తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని వేపరాల పంచాయతీ చిన్నక్కగారిపల్లికి చెందిన రైతు డి.నరసింహారెడ్డి కోరాడు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ నరసింహులుతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో 353 సర్వే నంబరుకు సంబంధించి తన పేరు, సంతకాన్ని ఫోర్జరీ చేసి గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారన్నారు. తప్పుడు ఫిర్యాదు కారణంగా గ్రామంలో వివాదాలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరాడు.

శతాధిక వృద్ధుడి మృతి

గుడిబండ: మండల పరిధిలోని మద్దనకుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఈరక్యాతప్ప (111) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈరక్యాతప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మద్దనకుంటకు చేరుకుని ఈరక్యాతప్ప మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ జగదాంబక్రిష్టప్ప, నాయకులు నంజుడయ్య, శంకరప్ప, సిద్దేగౌడు, కుమార్‌, మూడ్లిగిరియప్ప, రంగప్ప, నాగప్ప తదితరులు ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ప్రశాంతి నిలయం: వేలాది భక్తులు తమ ఆధ్యాత్మిక గురువు సత్యసాయిని స్మరిస్తూ గురువందనం సమర్పించారు. బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు గురువందనం పేరుతో సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. ట్రస్ట్‌ సభ్యుడు నాగానంద మాట్లాడారు. ప్రతి మనిషిని పరమ లక్ష్యం వైపు నడిపించే శక్తి గురువే అన్నారు. గురువుకు యోగ్యమైన అనుచరులుగా మారడమే నిజమైన గురుదక్షిణ అన్నారు. సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్‌ పాండ్య మాట్లాడుతూ సత్యసాయిని కోట్లాది మంది భక్తులు తమ ఆధ్యాత్మిక గురువుగా పూజిస్తున్నారన్నారు. సత్యసాయి శతజయంతి సందర్భంగా చేపట్టిన ప్రేమ ప్రవాహిని యాత్ర గురించి వివరించారు. సత్యసాయి మొబైల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ నిరంతరం 350 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. 20 సంవత్సరాల కాలంలో 15 లక్షల మంది పేద గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు. అనంతరం ఏపిరాన్‌ ఇండస్ట్రీస్‌ వారు అందించిన నూతన మొబైల్‌ ఆసుపత్రి వాహనాన్ని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు, పలువురు ట్రస్ట్‌ సభ్యులు ప్రారంభించారు. సాయంత్రం వేడుకలలో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు మహేష్‌ కాలే బృందం సంగీత కచేరీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement