● ఎస్పీ సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం అర్ధవార్షిక సంవత్సరంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరు నెలలుగా పోలీస్ శాఖ అహర్నిశలా పనిచేసి నేరాలు తగ్గించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. 364 కేసులు నమోదు చేసి, 254 కేసుల్లో రూ. 25.40 లక్షల జరిమానా విధించామన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. కొన్ని కేసుల్లో ఆరు నెలల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు. పదే పదే నమోదవుతున్న కేసుల్లో లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి సంబంధించి 2,248 కేసులు నమోదు కాగా 1,115 కేసుల్లో కోర్టులు రూ.8,56,400 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. చట్టాలను గౌరవిస్తూ ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ధర్నా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
పుట్టపర్తి అర్బన్: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ మంగళవారం పుట్టపర్తిలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తిలో బుధవారం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, రూరల్ మండల యూత్ ప్రెసిడెంట్ సునీల్ దత్తారెడ్డి, రామగిరి మండల కన్వీనర్ మీనుగ నాగరాజు విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు విచ్చేసి విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై పోరాటాలు సాగిస్తామన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మద్దెలచెరువు యువ నాయకుడు రొద్దం నరేష్, రామగిరి బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ దేవరాజులు పాల్గొన్నారు.


