టమాట.. నష్టాల మూట | - | Sakshi
Sakshi News home page

టమాట.. నష్టాల మూట

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

రైతును టమాట ఏటా ఠారెత్తిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో ఓ ఏడాది దిగుబడి తగ్గడం... ధరల పతనంతో మరోఏడాది పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడంతో పాటు ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగా టమాట రైతుకు కడగండ్లు మిగులుతున్నాయి.

పుట్టపర్తి అర్బన్‌: పంట పండితే మార్కెట్‌లో కొనేవారుండరు. ..ధర బాగుంటే దిగుబడి నామమాత్రంగా ఉంటోంది. అందుకే టమాట సాగుచేసిన రైతులు ఏటా నష్టాల పాలవుతున్నారు. ఒక్కోసారి కనీసం మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా దక్కే పరిస్థితి లేక రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. నారు, ఎరువుల ధరలతో పాటు కూలీల ఖర్చులు కూడా పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం...ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో టమాట సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు.

తగ్గుతున్న సాగు విస్తీర్ణం..

జిల్లాలో 16,130 హెక్టార్లకుపైగా కూరగాయలు సాగులో ఉండగా...అందులో ఒక్క టమాట పంటనే 8 వేల హెక్టార్లకుపైగా ఉంటోంది. గత ఏడాది ఏకంగా 11,391 హెక్టార్లలో టమాట సాగులోకి వచ్చినట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఈ సారి సరైన వర్షాలు లేకపోవడం..ధైర్యం చేసి పంటసాగుచేసినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభిస్తుందన్న భరోసా లేకపోవడంతో చాలా మంది రైతులు టమాట సాగుకు ముందుకు రాలేదు. ఫలితంగా సాగు విస్తీర్ణం బాగా తగ్గేలా ఉన్నట్లు తెలుస్తోంది.

అమాంతం పడిపోతున్న ధరలు..

పొలం సిద్ధం చేయడం, నారు నాటడం, ఎరువులు, కలుపు నివారణ చర్యలు తదితర అన్నీ కలుపుకుంటే రైతుకు ఎకరాకు రూ.లక్షపైనే ఖర్చవుతోంది. ఇంత ఖర్చు చేసి టమాట సాగు చేస్తే కాయలు కోసే సమయానికి మార్కెట్‌లో ధరలు పతనమవుతున్నాయి. రోజుల వ్యవధిలోనే టమాట ధరల్లో భారీ తేడా ఉంటోంది. ప్రస్తుతం టమాట బాక్సు (14 కిలోలు) నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.120 వరకూ ఉండగా.... 25 కిలోల బాక్సు ధర రూ.200 వరకు పలుకుతోంది. రైతులు పంట కోసి గ్రేడింగ్‌ చేసి పంటను మార్కెట్‌కు తరలించి ట్యాక్సు చెల్లించడానికి ఒక్కో బాక్సుకు రూ.80 నుంచి రూ.100 వరకూ ఖర్చు వస్తోంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఖర్చులు కూడా రావని పంటను కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నారు.

పరిహారం చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టమాటకు వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇందులో ఎకరా టమాట సాగుకు రూ.1,600 ప్రీమియం రైతులనుంచి వసూలు చేస్తున్నారు. అయితే ఈ రెండేళ్లలో వేలాది మంది రైతులు పంట నష్టపోయినా పరిహారం మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఈ ఏడాది ప్రీమియం చెల్లించడానికి ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు.

కొత్తచెరువు వద్ద తెగులుతో

దెబ్బతిన్న టమాట పంట

ఎర్రని పండు.. రైతుకు కడగండ్లు

రైతును నట్టేట ముంచుతున్న టమాట

గిట్టుబాటు ధరలు లేక ఏటా నష్టాలే

ప్రీమియం చెల్లించినా

పరిహారం ఇవ్వని ప్రభుత్వం

పంటల బీమాపై ఆసక్తి చూపని రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement