కదిరి: పట్టణంలోని 24వ వార్డులో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ముష్టి యుద్ధానికి దిగారు. ఆ వార్డు సచివాలయం వద్ద జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియలో తమదే పైచేయి ఉండాలంటూ ఇరు వర్గాలూ తన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం 24వ వార్డులోని షహమీరియా వీధిలోని సచివాలయం వద్ద ‘సర్’ కు సంబంధించిన ఎన్యుమరేషన్ పత్రాలను సిబ్బంది ఓటర్లకు అందజేసి, అక్కడే పూరిస్తున్నారు. ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా ఆ వార్డు టీడీపీ తాజా మాజీ కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫాతో పాటు ఆయన తమ్ముడు రొద్దం బషీర్ ఆ పత్రాలను నింపడంలో ఓటర్లకు సహకరిస్తున్నారు. అయితే గత నెలలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన సమీర్ ఖాన్ (జఫ్రాన్ హోటల్ యజమాని) అక్కడకు చేరుకొని టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ‘‘మీకు ఇక్కడేం పని.. వచ్చే ఎన్నికల్లో 24వ వార్డు నుంచి టీడీపీ తరఫున నేనే కౌన్సిలర్‌గా పోటీ చేస్తా, ఇక్కడ మీ పెత్తనమేంటి’’ అని గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే మాటామాటా పెరగడంతో సమీర్‌ఖాన్ తన అనుచరులతో కలిసి ఆల్ఫా ముస్తఫా, ఆయన తమ్ముడు బషీర్‌పై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా వారి ఇంట్లోకి దూరి ముస్తఫా కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. తర్వాత ముస్తఫా వర్గం సమీర్ ఇంటిపైకి దాడికి వెళ్లగా సమీర్ వర్గం ముందే సిద్ధం చేసుకున్న కారంపొడిని ముస్తఫా వర్గీయులపై చల్లారు. దీంతో ఒక్క సారిగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నారాయణరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సమీర్‌ను ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన ముస్తఫా, బషీర్, మరికొందరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలకు చెందిన మొత్తం 20 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
సచివాలయం వద్దే
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
గాయపడిన టీడీపీ తాజా మాజీ
కౌన్సిలర్ ముస్తఫా
ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన కదిరి పోలీసులు


