శునకం.. అధికారులకు కనకం | - | Sakshi
Sakshi News home page

శునకం.. అధికారులకు కనకం

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

హిందూపురం నుంచి 553 కుక్కలు పారిపోయాయి. అది కూడా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స తర్వాత అవన్నీ కనిపించకుండా పోయాయి..వినేందుకు విడ్డూరంగా ఉన్నా..

మున్సిపాలిటీ అధికారులు చెబుతున్న సమాధానం ఇదే. అందుకే రూ.32 లక్షల ప్రాజెక్టుపై అందరికీ అనుమానాలు తలెత్తున్నాయి. శునకం..

అధికారులకు కనకంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కార్యక్రమం పేరిట ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. సుమారు 2 వేల కుక్కల కుటుంబ నియంత్రణ కోసం ‘కరుణ’ అనే సొసైటీ ద్వారా రూ.32 లక్షల భారీ ప్రాజెక్ట్‌ అమలు చేసిన మున్సిపల్‌ అధికారులు, అందుకు సంబంధించిన అధికారిక సమాచారం అడిగితే నీళ్లు నలుముతున్నారు. ఆర్టీఐ ద్వారా గోవిందరాజులు అనే న్యాయవాది సమాచారం కోరగా.. అరకొర సమాధానం ఇస్తున్నారు.

కాగితాల్లో 812.. చూపించిదేమో 259

మున్సిపాలిటీ అధికారులు తమ లెక్కల్లో అధికారికంగా 812 కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు తెలిపారు. ఒక్కో కుక్క ఆపరేషన్‌కు రూ.1,500 ఖర్చు చేశామని, ఈ లెక్కన 812 కుక్కలకు రూ.12.18 లక్షలు వ్యయం చూపించారు. తీరా ఆర్టీఐ కింద బయటకు వచ్చిన రికార్డుల్లో కేవలం 259 కుక్కలకు సంబంధించిన రూ.3.88 లక్షల బిల్లులు మాత్రమే కనబరిచారు. మిగిలిన 553 కుక్కల ఖర్చుల వివరాలు అందులో పేర్కొన లేదు. పైగా కుక్కలకు కు.ని శస్త్ర చికిత్సలు చేసిన కరుణ సొసైటీకి ఇంకా రూ.10 లక్షల బకాయి ఉన్నట్టు చూపారు. దీంతో రూ.8.30 లక్షలు నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నది చర్చనీయాంశంగా మారింది. 812 కుక్కలకే ఖర్చు చేశారా..? లేక కేటాయించిన రూ.32 లక్షలూ మింగేశారా అనే విషయాలు సమగ్ర విచారణ జరిపితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆర్టీఐ కమిషన్‌ ఆదేశాలు బేఖాతరు

కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వ్యవహారంలో అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ సంగం శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సంతకం లేకుండానే ఆ ప్రాజెక్ట్‌ను కరుణ సొసైటీ అనే సంస్థకు కట్టబెట్టారు. మరి ఆ లెక్కల వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం కావడంతో న్యాయవాది గోవిందరాజులు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. అధికారులు అసంపూర్తిగా వివరాలు ఇవ్వడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌కు అప్పీల్‌ చేశారు. పూర్తి రికార్డులు వెంటనే ఇవ్వాలని హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ను కమిషన్‌ ఆదేశించినా... వారు నేటికీ పూర్తి సమాచారం ఇవ్వలేదు.

అన్నీ అనుమానాలే

హిందూపురం మున్సిపాలిటీలో నిజంగానే 812 కుక్కలకు ఆపరేషన్లు జరిగాయా..? జరిగి ఉంటే అందుకు సంబంధించిన రికార్డులు ఏమయ్యాయి..? లేక కాగితాలకే పరిమితం చేశారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. కనీసం ఫొటోలు, వెటర్నరీ వైద్యులు ధ్రువీకరించిన పత్రాలు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా మున్సిపల్‌ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కుక్కలకు కు.ని శస్త్ర చికిత్స పేరుతో స్వాహా పర్వం!

812 కుక్కలకు ఆపరేషన్లు

చేసినట్లు రికార్డులు

ఒక్కో కుక్కకు రూ.1,500 చొప్పున రూ.12.18 లక్షల వ్యయం

ఆర్టీఐ కింద సమాచారం అడిగితే అరకొర సమాధానం

రూ.32 లక్షల ప్రాజెక్ట్‌కు

బిల్లులు మాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement