ప్రశాంతినిలయం: అర్హులందరికీ దీపం–2, ఉజ్వల పథకంలో భాగంగా కొత్త కనెక్షన్లు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, గ్యాస్ ఏజెన్సీలు, డీలర్లు, అధికారులతో సమీక్షించారు. వినియోగదారుల హక్కులను కాపాడటం కోసం, నిత్యావసరాల సరఫరాలో పాదర్శకత కోసం కొత్తగా ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బ్యాంకు ఖాతాకు గ్యాస్ కనెక్షన్‌కు లింక్ కాకపోతే ఈకేవైసీ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు సూచించారు. అలాగే రేషన్ దుకాణాల్లో తూకాల్లో తేడాలున్నా... రేషన్ సరుకులు సకాలంలో ఇవ్వకపోయినా, గ్యాస్ డెలివరీ బాయ్ రసీదు కంటే అధికంగా వసూలు చేసినా 08555–288566 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు.
ఆంజనేయస్వామి
ఆలయంలో చోరీ
కనగానపల్లి: మండలంలోని బద్దలాపురంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు.. మూలవిరాట్‌పై ఉన్న ఆభరణాలతో పాటు బీరువాలోని వెండి, బంగారు ఆభరణాలు అపహరించారు. బుధవారం ఉదయం పూజాదికాలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన అర్చకుడు గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. 15 కిలోల వెండి, 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు, హుండీలో నగదు అపహరించుకెళ్లినట్లు నిర్ధారించారు. వీటి మొత్తం విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని ఆలయ పూజార్లు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రామగిరి సీఐ శ్రీధర్, కనగానపల్లి ఎస్‌ఐ రిజ్వాన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు గణితం పేపర్–2, సివిక్స్ పేపర్–2, ఒకేషనల్ విద్యార్థులకు పేపర్–2 పరీక్ష నిర్వహించారు. గణితం–2, సివిక్స్–2 పరీక్షకు సంబంధించి 8,346 మందిగాను 8,187 మంది హాజరయ్యారు. మరో 239 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి (డీఐఈఓ) చెన్న కేశవప్రసాద్ తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,290 మందికి గాను 1,231 మంది హాజరుకాగా, 59 మంది గైర్హాజయ్యారు. మొత్తమ్మీద 298 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు.


