ప్రశాంతి నిలయం: జిల్లాను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అగ్రస్థానంలో నిలిపేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) నిపుణులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. స్పా ప్రతినిధులు ప్రొఫెసర్ డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ అర్పన్ పాల్‌సింగ్ ప్రజెంటేషన్ ద్వారా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాలను పర్యావరణ–ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దడం, బుక్కపట్నం చెరువులో బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, పుట్టపర్తిలో ఔటర్ రింగ్ రోడ్డు, గ్రోత్ కారిడార్ల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడం, తిమ్మమ్మ మర్రిమాను ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని చరిత్రాత్మక కట్టడాలు, దేవాలయాల పరిరక్షణ, సాంస్కృతిక చరిత్ర కట్టడాలు, పర్యాటక అభివృద్ధికి కృషి చేయడం తదితర అంశాలను ప్రతిపాదించారు. వీటన్నింటిపై సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యల
పరిష్కారానికి హెల్ప్‌లైన్
వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వాటిపై సంబంధిత ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు స్పందించి వెంటనే పరిష్కార చర్యలు చేపడతారన్నారు.
ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
తాగునీటి సమస్య పరిష్కారానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు
అధికారులకు కలెక్టర్ ఆదేశం


