ధర్మవరం అర్బన్: పట్టణంలోని నేసేపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు .. పట్టణంలోని నేసేపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు హర్జేనాయక్(52) రామగిరి మండలం చిన్న కొండాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసైన ఆయన.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన భార్య నాగలక్ష్మి బాయితో తరచూ ఘర్షణ పడేవాడు. మంగళవారం రాత్రి కూడా ఏదో విషయంపై దంపతులిద్దరూ వాదులాడుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన హర్జేనాయక్ రాత్రి పొద్దుపోయాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన నాగలక్ష్మి బాయి ఉరికి వేలాడుతున్న భర్తను చూసి బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య నాగలక్ష్మి భాయితోపాటు ఇద్దరు కూతుళ్లు సంతానం. పెద్ద కూతురు శిరిచందన ఫార్మాడీ చదువుతోంది. రెండో కూతురు నవ్యశ్రీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ తెలిపారు.
కుటుంబ తగాదాల నేపథ్యంలో
భార్యతో ఘర్షణ
తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరి
భార్య నిద్రలేచి చూసే సరికే విగతజీవిగా కనిపించిన వైనం


