చెరువులో పడి యువకుడి మృతి
పెనుకొండ రూరల్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, రత్నమ్మ దంపతుల కుమారుడు హరీష్ (21) కుటుంబసభ్యులతో కలసి మరువపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. కూలి పనులతో జీవనం సాగించేవాడు. మంగళవారం ఉధయం గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం
కనగానపల్లి: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురానికి చెందిన మహేష్ (32).. రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన రాధమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్లుగా మరూరులోనే నివాసముంటూ బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం రాత్రి మరూరు నుంచి కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన మహేష్.. గ్రామ సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చెరువులో పడి యువకుడి మృతి


