రాయదుర్గంలో దొంగల బీభత్సం
● 2 కిలోల వెండి ఆభరణాల అపహరణ
రాయదుర్గం టౌన్: స్థానిక బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న సయ్యద్ జువెలరీ షాపులో ఐదుగురు దుండగులు ప్రవేశించి దాదాపు రూ.6 లక్షల విలువైన 2 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. ఒక్క వెండి ఆభరణం కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటలకు జరిగింది. కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే చోరీ చేసి తాము వచ్చిన ద్విచక్ర వాహనాలపైనే దుండగులు పరారైన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ఫుటీజీల్లో నిక్షిప్తమయ్యాయి. తొలుత రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు దుండగులు మాస్క్‌లు ధరించి జువెలరీ షాపు షట్టర్‌ను ఇనుప రాడ్‌తో వంచారు. ఓ దుండగుడు బయట కాపలా కాస్తుండగా మరో నలుగురు లోపలకు ప్రవేశించి దుకాణాలోని వెండి ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకున్నారు. బంగారం ఉన్న లాకర్‌ను పెకలించేందుకకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలపై బళ్లారి వైపుగా ఉడాయించారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు అటుగా వెళ్లిన స్థానికులు దుకాణం షట్టర్ వంచి ఉండడం గమనించి సమాచారం ఇవ్వడంతో యజమాని సయ్యద్ హరూన్ బాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పట్టణ సీఐ జయనాయక్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతపురం నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ సాయంతో దుండగుల వేలి ముద్రలు సేకరించారు. యజమాని హరూన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


