ఆ సంబంధమే హత్యకు ఉసిగొల్పింది
పెనుకొండ: వివాహేతర సంబంధం కారణంగానే ఓ యువకుడు హతమయ్యాడు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పెనుకొండ సీఐ రాఘవన్ తెలిపారు. పెనుకొండలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు వెంకటేషులు, వీరాంజనేయులుతో కలసి నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. రొద్దం మండలం పెదకోడిపల్లి గ్రామానికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న దంపతుల ఒక్కాగానొక్క కుమారుడు లింగమయ్య (24) దానిమ్మ కాయల ప్యాకింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లితో కలసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో లింగమయ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని అవమానంగా భావించిన వివాహిత సోదరుడు మనోజ్, కుటుంబసభ్యులు పలుమార్లు లింగమయ్యను మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా లింగమయ్యను హతమార్చాలని మనోజ్ పథకం వేశాడు. తన తోటి మిత్రులు నవీన్, ప్రభాస్ ద్వారా ఈ నెల 3న గ్రామ శివారులోకి లింగమయ్యను మనోజ్ పిలిపించుకున్నాడు. అక్కడ మాటామాట పెరగడంతో అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోడి కత్తులతో లింగమయ్యను మనోజ్ పొడిచాడు. ఆ సమయంలో లింగమయ్యను కదలకుండా నవీన్, ప్రభాష్ గట్టిగా పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన లింగమయ్య ఘటనా స్థలంలోనే మరణించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో మంగళవారం ఉదయం పెద్దమంతూరు గ్రామ శివారున తచ్చాడుతున్న మనోజ్, నవీన్, ప్రభాస్‌ను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు కోడి కత్తులు, మూడు సెల్‌ఫోన్లు, ఓ మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
యువకుడి హత్య కేసులో
నిందితుల అరెస్ట్


