వ్యాపార కోణం.. రైతుకు సహకారం | - | Sakshi
Sakshi News home page

వ్యాపార కోణం.. రైతుకు సహకారం

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

వ్యాప

వ్యాపార కోణం.. రైతుకు సహకారం

పంటల సాగుకు రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్త్తేసిన ప్రస్తుత తరుణంలో కొందరు వ్యాపారుల వినూత్న ఆలోచన అన్నదాతలకు వరంగా మారింది. సారవంతమైన భూమి, బోరుబావి ఉన్న రైతులకు కొందరు వ్యాపారులు విత్తు నుంచి కోతల వరకూ సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో పలు రకాల పంటలను రైతులకు సూచిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. పంట దిగుబడిని కొనుగోలు చేసిన వెంటనే డబ్బు అందజేస్తున్నారు.

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలోని కదిరి, తనకల్లుతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా (చియా సీడ్స్‌) పంటల సాగుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయా పంటలకు చెందిన విత్తనాలను రైతులకు సదరు వ్యాపారులు సమకూర్చడమే కాకుండా వాటి సాగు విధానాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం పర్యవేక్షిస్తూ అవసరమైన ఎరువులు, మందులు, నీటి తడుల వివరాలతో పాటు కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చైతన్య పరుస్తున్నారు.

ఆర్థికంగా అండగా..

తాము సూచించిన పంటల సాగు చేపట్టిన రైతులకు విత్తనం మొదలు కూలీల ఖర్చు వరకూ అన్ని రకాల సదుపాయాలను వ్యాపారులే కల్పిస్తున్నారు. రైతు చేయాల్సిందల్లా పంటలను సాగు చేయడం, వాటిని సంరక్షించడం, అవసరమైన నీటి తడులు అందించడం, రోగాలు వ్యాపిస్తే వాటిని సదరు వ్యాపారులకు తెలియజేసి అవసరమైన మందులు తీసుకుని పిచికారీ చేయించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువులు అందించి పంట పూర్తి కాగానే వ్యాపారులకు తెలియజేస్తే వారే క్షేత్రస్థాయిలో పరిశీలించి యంత్రాల సాయంతో కోతలు ముగిస్తారు. పంటల దిగుబడులను క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి ముందస్తుగా నిర్ణయించిన ధరల ప్రకారం అప్పటికప్పుడు నగదు అందజేస్తారు. కేవలం మూడు నెలల్లోనే రైతుపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వ్యాపారులు అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో జిల్లాలోని పలు మండలాల్లో సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా గింజల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

1,074 హెక్టార్లకు పైగా..

వ్యాపారుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా 1,074 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, సబ్జా గింజలు, సజ్జ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 250 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 420 హెక్టార్లలో సబ్జా గింజలు, 404 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సజ్జ సాగులో ఉన్నాయి. బోరుబావి ఉండి, ఆసక్తి కనబరిచే రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను వ్యాపారులే అందజేస్తున్నారు. పంట పూర్తి కాగానే మిషన్ల ద్వారా కోతలు చేపట్టి నూర్పిడి అనంతరం ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు రైతులకు నగదు చెల్లించిన తర్వాతనే మార్కెట్‌కు పంట దిగుబడులను తరలిస్తున్నారు. ఈ లెక్కన క్వింటా పొద్దుతిరుగుడు పంటను రూ.12 వేలతో, క్వింటా సబ్జా గింజలను రూ.13,500తో, క్వింటా సజ్జ పంటను రకాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల సహకారంతో తమకు ఆర్థిక, మార్కెటింగ్‌ ఇబ్బందులు తొలిగిపోయాయని రైతులు పేర్కొంటున్నారు.

సజ్జ, పొద్దుతిరుగుడు, సబ్జా పంటల సాగుకు వ్యాపారుల ప్రోత్సాహం

విత్తు నుంచి కోత వరకూ సహకారం

దిగుబడిని కొనుగోలు చేసి

డబ్బు అందజేత

వ్యాపార కోణం.. రైతుకు సహకారం1
1/2

వ్యాపార కోణం.. రైతుకు సహకారం

వ్యాపార కోణం.. రైతుకు సహకారం2
2/2

వ్యాపార కోణం.. రైతుకు సహకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement