ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఇల్లు దగ్ధం

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

ఇల్లు

ఇల్లు దగ్ధం

నల్లమాడ: మండలంలోని గంగాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి రైతు నాగయ్య ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాగయ్య మరో ఇంట్లో నిద్రిస్తున్నట్లుగా తెలిసింది. రెండున్నర తులాల బంగారు నగలు, రూ.20 వేల నగదు, విద్యుత్‌ ఉపకరణాలు, వంట పాత్రలు, దుస్తులు, పట్టాదారు పాసు పుస్తకం తదితరాలు కాలి బూడిదయ్యాయి. ఇంటి గోడలు, పైకప్పు బాగా దెబ్బతిన్నాయి. రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

లారీ బీభత్సం

గుత్తి: స్థానిక ఆర్‌ఎస్‌ రోడ్డులోని లక్ష్మమ్మ గుడి సమీపంలో ఆదివారం ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన డ్రైవర్‌ ఆనందరెడ్డి ఆదివారం కర్నూలు జిల్లా ఆదోని నుంచి లారీలో తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే అప్పటికే మద్యం సేవించి ఉండడంతో గుత్తి ఆర్‌ఎస్‌కు చేరుకోగానే మత్తు కారణంగా నియంత్రణ కోల్పోయి లారీని ఇష్టానుసారంగా నడుపుతూ స్థానికులను భయాందోళనకు గురి చేశారు. డివైడర్‌ మధ్యలో ఉన్న రెండు బటర్‌ఫ్లై విద్యుత్‌ స్తంభాలను ఢీకొనడంతో అవి కాస్త విరిగి పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించినా ఫలితం లేకపోయింది. చివరకు ఎన్టీఆర్‌ సర్కిల్‌లో లారీని అడ్డుకుని డ్రైవర్‌ ఆనందరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేశారు.

యువకుడి దుర్మరణం

పరిగి: వరుస ప్రమాదాలు చోటు చేసుకుని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం మండలం సూగూరు సడ్లపల్లికి చెందిన ధనుజంయరెడ్డి కుమారుడు సి.బాబు (26) స్థానిక ఓ గార్మెంట్స్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. మడకశిర మండలం అగ్రంపల్లిలో నివాసముంటున్న తన అక్క ప్రమీలమ్మను చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. పరిగి మండలం హొన్నంపల్లి పంచాయతీ జంగాలపల్లి క్రాస్‌ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో రెండు వాహనాలపై ఉన్న వారు రోడ్డుపై పడ్డారు. ఈ క్రమంలో బాబుపై వాహనం దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు.డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు కనగానపల్లికి చెందిన వ్యక్తికి కాలు విరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

జేసీబీ యజమానుల ర్యాలీ

హిందూపురం: పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా తమ సేవల ధరలను పెంచిక తప్పడం లేదని హిందూపురంలో జేసీబీ వాహన యజమానులు గళమెత్తారు. ఆదివారం సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో అసోసియేషన్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా డీజిల్‌ ధరలు, యంత్రాల విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దీంతో జేసీబీల నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జేసీబీ పనివేళల ధరలు పెంచక తప్పడం లేదన్నారు. గతంలో గంటకు రూ.వెయ్యి చొప్పున తీసుకునేవారని, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం గంటకు రూ.1,300 చొప్పున తీసుకునేలా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సూగూరు ఆలయం వద్ద నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకూ జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీబీ వాహన యజమానులు హనుమంతరెడ్డి, నేపాల్‌ నాగరాజు, ఆనంద్‌ కుమార్‌, లోకేష్‌, ఆనంద్‌, వెంకటేష్‌, సడ్లపల్లి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

ఇల్లు దగ్ధం 1
1/2

ఇల్లు దగ్ధం

ఇల్లు దగ్ధం 2
2/2

ఇల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement