హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రొళ్ల: వ్యక్తి హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మడకశిర రూరల్ పీఎస్ సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. స్థానిక పీఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్‌ఐ గౌతమితో కలసి ఆయన వెల్లడించారు. రొళ్ల మండలం ఎం.రాయాపురం గ్రామంలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ (40)ను అదే గ్రామానికి చెందిన నాగరాజప్ప శనివారం సాయంత్రం కట్టెతో దాడి చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. హతుడి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఆదివారం సాయంత్రం ఎం.ఆర్.గొల్లహట్టి గ్రామానికి వెళ్లే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం మలుపు వద్ద తచ్చాడుతున్న నాగరాజప్పను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యక్తిగతంగా అనుమానంతో ప్రసన్నకుమార్‌పై కట్టెతో దాడి చేసినట్లుగా నాగరాజప్ప అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి,. సోమవారం ఉదయం మడకశిరలోని జేఎఫ్‌సీఎం న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


