ప్రైవేటు క్లినిక్‌లలో ఆకస్మిక తనిఖీలు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని పలు ప్రైవేటు క్లినిక్‌లలో శనివారం సాయంత్రం జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బృందంలోని ఆర్డీఓ మహేష్, డీఎస్పీ హేమంత్‌కుమార్, తహసీల్దార్ సురేష్‌బాబు, ఎస్‌ఐ ఉమాదేవి, డాక్టర్ సురేష్, వీఆర్‌ఓ రవిశేఖర్‌రెడ్డిలు క్లినిక్‌లలో రోగులకు అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి రోగులకు చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించి క్లినిక్‌ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు ప్రైవేటు క్లినిక్‌లకు షోకాజ్ నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు. క్లినిక్‌లలో ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలని, ఎలాంటి ఇంజెక్షన్లు, సైలెన్ బాటిళ్లు, స్టెరాయిడ్‌లు రోగులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు ప్రైవేటు క్లినిక్ నిర్వాహకులు చికిత్సా కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయారు.
మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలకు తాళం..
చెన్నేకొత్తపల్లి: నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న మూడు ప్రథమ చికిత్సా కేంద్రాలకు శనివారం అధికారులు తాళాలు వేశారు. మండల కేంద్రంలోని పలు ఆర్‌ఎంపీ కేంద్రాలను తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీఓ బాలక్రిష్ణుడు, వైద్యాధికారి డాక్టర్ రవినాయక్, ఎస్‌ఐ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు తేలడంతో ఆయా కేంద్రాల నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. కేంద్రాల్లో కేవలం ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వాసుపత్రులకు పంపాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో మూడు కేంద్రాలకు తాళాలు వేశారు. కాగా, తనిఖీల విషయం తెలుసుకున్న పలువురు ఆర్‌ఎంపీలు కేంద్రాలకు తాళం వేసి వెళ్లిపోవడం గమనార్హం.


