మొక్కజొన్న పంట దగ్ధం
పుట్టపర్తి అర్బన్: గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి మొక్కజొన్న పంట దగ్ధమైంది. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు మురళి, శివప్ప, అంజి తదితరులు చిత్రావతి సమీపంలోని వేంకటేశ్వరస్వామి కొండ సమీపంలో సుమారు 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు రాజేయడంతో మంటలు వ్యాపించి సుమారు రెండు ఎకరాల్లోని పంట మొత్తం కాలిపోయింది. చుట్టుపక్కల రైతులు స్పేయర్లను ఉపయోగించి నీటిని పిచికారీ చేస్తూ మంటలను అదుపు చేశారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
బోర్‌వెల్ రాడ్ పడి వ్యక్తి మృతి
బ్రహ్మసముద్రం : బోర్‌వెల్ రాడ్ తలపై పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకలి రామన్న పొలంలో గురువారం అర్ధరాత్రి బోర్ వేస్తుండగా పలువురు గ్రామస్తులు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బోర్‌వెల్ హైడ్రాలిక్ రాడ్ ఉన్నఫళంగా జారి అక్కడే ఉన్న గొల్ల అజ్జప్ప(45) తలపై పడింది. ఘటనలో అజ్జప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.
ముగిసిన రీసెర్చ్
అడ్మిషన్ల ఇంటర్వ్యూలు
అనంతపురం: ఈ నెల 2వ తేదీ నుంచి జేఎన్‌టీయూ (ఏ)లో చేపట్టిన రీసెర్చ్ అడ్మిషన్ల ఇంటర్వ్యూలు శుక్రవారం ముగిశాయి. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో నలుగురు, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం నుంచి 136 మంది, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ విభాగం నుంచి 103 మంది, ఎకనమిక్స్ విభాగంలో 31 మంది, ఈఈఈ విభాగంలో 139 మంది అభ్యర్థులు హాజరు కాగా, జేఎన్‌టీయూ (ఏ) వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల ప్రక్రియ సజావుగా జరిగినట్లు డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఎ.సురేష్‌బాబు వెల్లడించారు.
మళ్లీ చిరుత కలకలం
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని సంజీవపురంలో మరోసారి చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళపై 3 రోజుల క్రితం చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ శుక్రవారం చిరుత ప్రత్యక్షం కావడం గమనార్హం. అయితే చిరుతను చూసిన గ్రామానికి చెందిన యువకులు రాళ్లు, కర్రలతో దాన్ని వెంబడించగా.. హెచ్‌ఎల్‌సీ వైపు పారిపోయింది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రమూ సహాయక చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు పనులు అడ్డుకున్న కాలనీ వాసులు
కనగానపల్లి: మండలంలోని తూంచర్ల గ్రామంలో శుక్రవారం తారురోడ్డు పనులను స్థానిక ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. అనంతపురం నుంచి తూంచర్ల మీదుగా తగరకుంట వైపు తారురోడ్డు పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ రోడ్డును స్థానిక టీడీపీ నేత పొలాల వైపు నుంచి కాకుండా కాలనీ వైపు మళ్లించారు. ఇందు కోసం కాలనీలోని మరుగుదొడ్లను తొలగించడంతో పలువురు దళితులు ఆందోళన చేపట్టి అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే. దీంతో సర్వే అనంతరం రహదారి కొలతలు నిర్ధారించి రోడ్డు వేయాలని భావించారు. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి శుక్రవారం పనులు కొనసాగిస్తుండడంతో ఎస్సీ కాలనీ వాసులు అక్కమ్మ, లక్ష్మీదేవి, పార్వతమ్మ, నాగన్న, నల్లప్ప తదితరులు అడ్డుకున్నారు.
మొక్కజొన్న పంట దగ్ధం
మొక్కజొన్న పంట దగ్ధం


