క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు
● రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్
గుత్తి: రాయలసీమ డయాసిస్ పరిధిలో ఉన్న క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ తెలిపారు. గుత్తి సీఎస్‌ఐ చర్చిలో పాస్టర్లు, క్రైస్తవ సంఘం సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమై మాట్లాడారు. క్రైస్తవ మిషనరీ ఆస్తులను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే , ఇతర ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను బిషప్‌తో పాటు క్రైస్తవ సంఘం పెద్దలు, పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో డివిజనల్ చైర్మన్ డేవిడ్ నాయక్, ఎంఎస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ రస్సెల్ కిరణ్, బిషప్ సతీమణి భారతి, క్రైస్తవ సంఘం సభ్యులు విజయ్‌కుమార్, సునీల్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పని ఒత్తిడే ప్రాణాలు బలిగొంది
● వైద్యురాలి మృతిపై తల్లిదండ్రుల ఆరోపణ
తలుపుల: విజయవాడలోని జీజీహెచ్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తూ బుధవారం రాత్రి మృతి చెందిన పీజీ వైద్యురాలు బత్తుల దీపిక (27) ఘటనపై తల్లిదండ్రులు బత్తుల కోదండ రామిరెడ్డి, భారతి అనుమానాలు వ్యక్తం చేశారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే తమ కుమార్తె మృతికి కారణమంటూ ఆరోపించారు. దీపిక అమ్మమ్మ గారి ఊరైన తలుపుల మండలం మాడికవాండ్లపల్లిలో శుక్రవారం బంధుమిత్రుల మధ్య దీపిక అంత్యక్రియలు జరిగాయి. అనంతపురానికి చెందిన కోదండ రామిరెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, గైనకాలజిస్టుగా మౌనిక, అనస్థీషియా వైద్యురాలిగా దీపిక పనిచేస్తున్నారు. మౌనికకు పెళ్లి అయి పాప కూడా ఉన్నారు. పీజీ పూర్తి కాగానే దీపికకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో నిరంతరాయంగా 36 గంటల పాటు పని చేయాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయిన దీపిక చనిపోయిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని బాధిత తల్లిదండ్రులు కోరారు.
వ్యాపారం పేరుతో టోకరా
బుక్కరాయసముద్రం: డబ్బు తీసుకుని కిరాణా సరుకులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను శుక్రవారం వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ఆనంద్‌గుప్తా బీకేఎస్‌లోని ముసలమ్మ కట్ట వద్ద రఘురామ ట్రేడర్స్ పేరుతో గోదాము ఏర్పాటు చేసుకుని, నగరంలోని పలు కిరాణా దుకాణాలకు సరుకులు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే శ్రీసాయి ట్రేడర్స్ పేరుతో హోల్‌సేల్ డీలర్ షిప్ నిర్వహిస్తున్న అనంతపురానికి చెందిన రామలక్ష్మి అరవింద్ దంపతులకు నిత్యావసర సరుకుల కోసం రూ.28.70 లక్షలను ఆనంద్‌గుప్తా చెల్లించాడు. అనంతరం రామలక్ష్మి దంపతులు సరుకులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిలదీస్తే అరవింద్ బెదిరింపులకు దిగాడు. ఘటనపై బాధితుడు ఆనంద్‌గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు


