ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై పోస్టుకార్డు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై పోస్టుకార్డు ఉద్యమం

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై పోస్టుకార్డు ఉద్యమం

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై పోస్టుకార్డు ఉద్యమం

ధర్మవరం అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లపై పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టినట్లు యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యరద్శి రమావత్‌ రామకృష్ణ నాయక్‌ తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో సీఎం చంద్రబాబుకు 200 పోస్టుకార్డులు పంపుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరంలోని శాంతినగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా నేటికీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలపై స్పందన లేకుండా పోయిందన్నారు. పలుమార్లు విన్నవించినా ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కాని చలనం లేకుండా పోయిందన్నారు. దీంతో ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. యూటీఎఫ్‌ పోస్ట్‌కార్డు ఉద్యమం ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలను తీసుకెళుతున్నట్లు వివరించారు. 12వ పీఆర్‌సీ నియామకం, పెండింగ్‌ డీఏల చెల్లింపు, 29 శాతం మధ్యంతర భృతి, ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్‌ మ్యాప్‌ ప్రకటన, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయడం, 2004 ముందు నియామకమైన వారికి పాత పెన్షన్‌ విధానం అమలు చేయడం తదితర సమస్యలపై పోరుబాట చేపట్టినట్లు వివరించారు. డిమాండ్లపై ఈ నెల 15వ తేదీ లోపు ప్రభుత్వం స్పందించకపోతే 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ పట్టణ గౌరవాధ్యక్షుడు కేవీ నాగిరెడ్డి, నాయకులు సాయి గణేష్‌, ప్రదీప్‌కుమార్‌, పాఠశాల హెచ్‌ఎం ఉమాపతి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జానకి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement