సేవాలాల్ జయంత్యుత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు గుత్తి మండలం సేవాఘడ్‌లో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం అదనపు బస్సులు నడపాలన్నారు. సేవాఘడ్ వద్ద స్టాపింగ్ సదుపాయం కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాలు, కనీస వసతులు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి వేడుకలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గుంతకల్లు ఆర్‌డీఓ ఏబీవీఎస్‌పీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, ట్రస్ట్ అధ్యక్షుడు కేశవనాయక్, కార్యదర్శి అశ్వర్థనాయక్, ప్రతినిధులు బాలనాయక్, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, గుత్తి, గుంతకల్లు తహసీల్దారు పుణ్యవతి, రమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జేసీ విష్ణు చరణ్


