ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్‌రూల్స్ అమలుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఈఓలు, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయాలు, డైట్ ఉద్యోగుల వర్క్‌షాపు గురువారం నిర్వహించారు. స్థానిక పంగల్‌రోడ్డులోని ఆర్డీటీ స్కూల్‌లో జరిగిన వర్క్‌షాపును జేడీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోక్సో కేసుల్లో త్రీమెన్ కమిటీని నియమించి మూడు నెలల్లో విచారణ నివేదిక తీసుకోవాలన్నారు. క్రమశిక్షణ చర్యల కేసులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కొన్ని కేసుల్లో సస్పెన్షన్లు చేస్తున్నా...తర్వాత వాటిని రీఓక్ చేయడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదికి మించి సస్పెన్షన్‌లో ఉండకూడదన్నారు. కొందరు దూరప్రాంతాల్లో పని చేస్తున్న వారు కావాలనే చిన్నచిన్న తప్పులకు సస్పెన్షన్లు చేయించుకుంటున్నారన్నారు. 3–4 ఏళ్లు సస్పెన్షన్‌లోనే ఉంటూ అరజీతం పొందుతున్నారన్నారు. సమావేశంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా డీఈఓలు ఎం.ప్రసాద్‌బాబు, కిష్టప్ప, ఏడీ మునీర్‌ఖాన్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


