కూలీని మింగిన ఇసుక మేట
హిందూపురం: ఇసుక మేట మీద పడి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని అప్పలకుంట వద్ద జరిగింది. హిందూపురం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని మేళాపురానికి చెందిన రామమూర్తి (70) కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. మంగళవారం అప్పలకుంట గ్రామ సమీపంలోని పెన్నానది వద్ద ఇసుక తవ్వి ట్రాక్టర్‌లో నింపే పనులకు వెళ్లాడు. ఇసుక తవ్వుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇసుక మేట కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇసుకలో కూరుకుపోయిన రామమూర్తి ఊపిరాడక మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


